కూలేందుకు సిద్ధంగా కేపీహెచ్ బీ థర్డ్ ఫేజ్ ఫ్లాట్లు

కూలేందుకు సిద్ధంగా కేపీహెచ్ బీ థర్డ్ ఫేజ్ ఫ్లాట్లు

కూకట్ పల్లి, వెలుగు : కూకట్​పల్లి హౌసింగ్ ​బోర్డు కాలనీ మూడో ఫేజ్​లోని 3,097 ఫ్లాట్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. గోడలు, శ్లాబులు ఎక్కడిక్కడ పెచ్చులూడి పడుతున్నాయి. పేద, మధ్య తరగతి వారికి కోసం నాలుగు దశాబ్దాల కింద హౌసింగ్ ​బోర్డు తక్కువ ఖర్చుతో ఈ ఇళ్లను కట్టించింది. ఎల్ఐజీ(లోయర్ ఇన్ కమ్ గ్రూప్), ఎంఐజీ(మిడిల్ ఇన్కం గ్రూప్) కింద కేటాయించింది. ప్రస్తుతం అన్ని బిల్డింగులు ప్రమాదకరంగా మారాయి. పాత నిర్మాణాలను కూల్చి తిరిగి నిర్మించుకునేందుకు అవకాశం లేకపోవడంతో లబ్ధిదారులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. పునర్నిర్మాణానికి జీహెచ్ఎంసీ ఒప్పుకోకపోవడం శాపంగా మారింది.వేల మంది ప్రాణాలకు ముప్పు ఉందని మొరపెట్టుకుంటున్నా బల్దియా అధికారులు పట్టించుకోవట్లేదు.

4 దశాబ్దాల కింద నిర్మాణం..

1980లో  బోర్డు అధికారులు మూడో ఫేజ్​లో భాగంగా ఎల్ఐజీ, ఎంఐజీ విభాగాల్లో ఇండ్ల నిర్మాణం చేపట్టారు. అంతకు ముందు ఒకటి, రెండు ఫేజుల్లో ఎల్ఐజీ, ఎంఐజీ, ఈడబ్ల్యూఎస్ విభాగాల్లో ఇండిపెండెంట్ ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు కేటాయించారు. కూకట్​పల్లి ఏరియాలో క్రమంగా ఇండ్లకు డిమాండ్ పెరగడం, స్థలం తగ్గడంతో మూడో ఫేజ్​లో జీ ప్లస్ టూ పద్ధతిలో ఫ్లాట్లు(2,545 ఎల్ఐజీ, 552 ఎంఐజీ) నిర్మించారు. లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు కేటాయించారు. ఆ టైంలో ఇన్​స్టాల్ మెంట్​పద్ధతిలో బోర్డుకు పైసలు చెల్లించే అవకాశం కల్పించారు. మొత్తం చెల్లించాక లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. రూ.5 నుంచి రూ.6 లక్షల లోపే ఫ్లాట్​వచ్చింది. 

హైటెక్ ​సిటీకి ఆనుకొని..

కేపీహెచ్​బీ మూడో ఫేజ్ హైటెక్ సిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. జేఎన్​టీయూ నుంచి హైటెక్ సిటీకి మెయిన్ ​రోడ్డుకు పక్కనే ఫ్లాట్లు ఉంటాయి. సాఫ్ట్​వేర్ ​ఎంప్లాయ్స్​ఎక్కువగా మూడో ఫేజ్​ ఇండ్లలో ఉంటున్నారు. కొందరు గతంలో సెట్​ బ్యాక్ ​కోసం వదిలిన స్థలంలో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టి అద్దెలకు ఇస్తున్నారు. 

పునర్నిర్మాణ అనుమతి లేక అవస్థలు..

బోర్డు అధికారులు మూడో ఫేజ్​లో ఎల్ఐజీ, ఎంఐజీ ఇండ్లను బ్లాక్​లో ఆరు ఫ్లాట్లుగా నిర్మించారు. మధ్యలో మెట్లు నిర్మించి ఒక పక్క మూడు, మరో పక్క మూడు ఫ్లాట్లు నిర్మించారు. మొత్తం ఆరు ఫ్లాట్ల ఓనర్లు కానీ లేదా ఒకవైపు మూడు ఫ్లాట్ల ఓనర్లు కానీ పరస్పర అంగీకారంతో పునర్నిర్మాణం చేసుకునేందుకు అవకాశం ఉన్నా జీహెచ్ఎంసీ అధికారులు అందుకు పర్మిషన్ ​ఇవ్వడం లేదు. బాధితులు స్థానిక కార్పొరేటర్​ మొదలు మంత్రుల వరకు, ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇస్తూ వస్తున్నారు. ఒక్కరూ పట్టించుకోవడం లేదు. 

వానా కాలంలో ప్రమాదాలు..

వర్షాకాలంలో ఏదో ఒకచోట ప్రమాదం జరుగుతోంది. గోడలు నాని కూలుతున్నాయి. ఇప్పటికే చాలా బిల్డింగుల బాల్కనీలు పెచ్చులూడాయి. గతేడాది ఎల్ఐజీ బ్లాక్ నం.49లోని మొదటి అంతస్తు బాల్కనీ కూలి ఓ బాలుడు, బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ టైంలో అధికారులు హడావుడి చేశారే తప్ప శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోలేదు. బల్దియా అధికారుల నిర్లక్ష్యంతో అక్రమ నిర్మాణాలు పెరుగుతున్నాయి. ఈ అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించటం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.