సమోసాలు, చిప్స్, వేపుళ్లతో డయాబెటిస్​

సమోసాలు, చిప్స్, వేపుళ్లతో డయాబెటిస్​
  •     భారతీయుల్లో 10 కోట్ల మంది బాధితులు
  •     ఐసీఎంఆర్ తాజా నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ : సమోసాలను ఎంతో ఇష్టంగా లాగిస్తుంటారా.. చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ లను తరచుగా తింటుంటారా.. అయితే, మీకు మధుమేహ ముప్పు పొంచి ఉన్నట్లేనని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ చిరుతిళ్లతో పాటు బాగా వేయించిన పదార్థాలు, అత్యధిక ఉష్ణోగ్రత వద్ద కాల్చిన ఆహార పదార్థాలే భారతీయుల్లో మధుమేహ బాధితులను పెంచుతున్నాయని ఇండియన్ కౌన్సిల్​ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తాజా నివేదికలో వెల్లడించింది. ప్రజారోగ్య పరంగా మన దేశం ఎదుర్కొంటున్న సవాళ్లలో మధుమేహం కూడా ఒకటని తెలిపింది. 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 కోట్ల 10 లక్షల మంది డయాబెటిక్ పేషెంట్లు ఉన్నారని ఐసీఎంఆర్ రిపోర్టు పేర్కొంది. బాగా వేయించిన ఆహార పదార్థాలను అడ్వాన్స్ డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రాడక్టు(ఏజీఈ) లుగా వ్యవహరిస్తామని సైంటిస్టులు పేర్కొన్నారు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మధుమేహ ముప్పు పెరగడంతో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్, సెల్యులర్ డామేజ్ తదితర దుష్పరిణామాలు కూడా ఎదురవుతాయని వివరించారు. ఆహార పదార్థాలను అత్యధిక టెంపరేచర్ తో తయారు చేసినపుడు వాటిలోని ప్రొటీన్లు హానికారకంగా మారిపోతాయని అన్నారు. 

ఈమేరకు దేశంలోనే తొలిసారిగా ఐసీఎంఆర్ కు చెందిన మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ 12 వారాలపాటు అధ్యయనం చేపట్టి ఈ వివరాలను వెల్లడించింది. రెడ్ మీట్, ఫ్రెంచ్ ఫ్రైస్, పరాఠాలు, సమోసాలు, బేకరీ ఉత్పత్తులు, తీపి పదార్థాలలో ఏజీఈ ఎక్కువని ఫౌండేషన్  చైర్మన్ వి. మోహన్​  చెప్పారు. మధుమేహం బారిన పడడానికి ప్రధాన కారణాలు ఒబెసిటీ

శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన చిరుతిళ్లు, ఆహారం తీసుకోవడమేనని వివరించారు. దీనిని తప్పించుకోవడానికి ఫ్రై, రోస్ట్, గ్రిల్ చేసిన ఆహార పదార్థాల జోలికి వెళ్లకుండా ఏజీఈ తక్కువగా ఉండే ఆకుకూరలు, పండ్లు, చేపలు, ఉడకబెట్టిన ఆహార పదార్థాలు, బ్రౌన్ రైస్ తీసుకోవాలని ఆయన సూచించారు.