చైనాలో కొండచరియలు విరిగిపడి 31మంది దుర్మరణం

బీజింగ్ :  చైనాలోని యునాన్ ప్రావిన్స్‌‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. జెన్‌‌క్సియాంగ్ కౌంటీ లోని ఓ గ్రామంలో  సోమవారం కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇప్పటిదాకా 31 మంది చనిపోయారు. చాలామంది గల్లంతయ్యారు. ఝాటోంగ్ సిటీలోని లియాంగ్‌‌షుయ్ గ్రామంలోనూ విరిగిపడిన కొండచరియల కింద 47 మంది చిక్కుకుపోయారు. వారిని వెలికి తీసేందుకు 1,000 మందికి పైగా రెస్క్యూ వర్కర్లు రంగంలోకి దిగారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం  సైన్యంతోపాటు  మిలీషియాలను కూడా ప్రభుత్వం మోహరించింది. జెన్‌‌క్సియాంగ్  కౌంటీలో మొత్తం 104 మంది మిలీషియా సభ్యులు రెస్క్యూ పనులు నిర్వహిస్తున్నారు. 

బాధితులను త్వరగా కాపాడండి :  జిన్‌‌పింగ్ 

బాధితులను ఆదుకునేందుకు చైనా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొత్తం 213 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికోసం 200 టెంట్లు, 400 క్విల్ట్‌‌లు(దుప్పట్లు), 600 కాటన్ కోట్లు,14 సెట్ల అత్యవసర లైటింగ్ పరికరాలను ఏర్పాటు చేశారు. కొండచరియల కింద చిక్కుకున్నవారిని వీలైనంత త్వరగా కాపాడాలని అధికారులను చైనా అధ్యక్షుడు జీ జిన్‌‌పింగ్ సోమవారం ఆదేశించారు. సాధ్యమైనంతవరకు ప్రాణనష్టాన్ని తగ్గించాలని కోరారు. విపత్తు సహాయం, అత్యవసర రెస్క్యూ పనుల కోసం 50 మిలియన్ యువాన్లను (సుమారు రూ.60 కోట్లు) కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కొండ శిఖరం కూలిపోవడం వల్లే కొండచరియలు విరిగిపడ్డాయని చైనా నిపుణుల బృందం తేల్చింది.