![ఛత్తీస్ ఘడ్ లో మరో భారీ ఎన్ కౌంటర్.. 31 మంది మావోలు మృతి](https://static.v6velugu.com/uploads/2025/02/31-maoists-killed-in-chhattisgarh-gunfight-2025-toll-now-81_HBjpAmCwZf.jpg)
- మృతుల్లో 11 మంది మహిళలుప్రాణాలు కోల్పోయిన ఇద్దరు జవాన్లు
- బీజాపూర్ జిల్లాలోని నేషనల్పార్క్ ఏరియాలో ఎదురుకాల్పులు
- దాదాపు 16 గంటల పాటు కొనసాగిన ఎన్ కౌంటర్
- ఈ ఏడాది ఇప్పటి వరకు 86 మంది మావోయిస్టులు మృతి
భద్రాచలం, వెలుగు: చత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్పార్క్ ఏరియాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఆదివారం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 31 మంది మావోయిస్టులు చనిపోయారు. వీరిలో 11 మంది మహిళలు ఉన్నారు. ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. గాయపడిన జవాన్లను హెలికాప్టర్ ద్వారా జగదల్పూర్కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఎన్కౌంటర్లో కీలక నేతలు చనిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. స్పాట్లో భారీ సంఖ్యలో ఏకే- 47, ఎస్ఎల్ఆర్, ఇన్సాస్, రాకెట్ లాంచర్లు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
వారం కిందనే సమాచారం..
మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ బార్డర్‌లోని బీజాపూర్ జిల్లా ఫర్సేగఢ్ పరిధి ఇంద్రావతి నేషనల్ పార్కు ఏరియాలో మావోయిస్టులు సమావేశమవుతున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలకు వారం కిందనే సమాచారం అందింది. దీంతో జాయింట్ఆపరేషన్ చేపట్టేందుకు రెండు రాష్ట్రాల పోలీసులు రంగంలోకి దిగారు. నాలుగు రోజుల కిందనే మహారాష్ట్ర నుంచి సీ60 కమాండోస్, చత్తీస్‌గఢ్‌కు చెందిన డీఆర్జీ, ఎస్టీఎఫ్, బస్తర్‌ఫైటర్స్ ను నేషనల్ పార్క్ ఏరియాలో మోహరించారు. బస్తర్ ఐజీ సుందర్రాజ్ పర్యవేక్షణలో మొత్తం 650 మందితో కూడిన బలగాలను ఈ ప్రాంతంలోకి పంపించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందు మావోయిస్టులు భారీ విధ్వంసానికి స్కెచ్వేస్తున్నట్టుగా గ్రహించి బలగాలతో కూంబింగ్ ముమ్మరం చేశారు. ఈ క్రమంలో శనివారం రాత్రి వరకు మావోయిస్టులు ఉన్న ప్రాంతాన్ని నాలుగు దిక్కుల నుంచి భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. అక్కడ నేషనల్ పార్కు ఏరియా, సౌత్‌బస్తర్, అబూజ్‌మఢ్ మావోయిస్టు కమిటీలు సమావేశమైనట్టు గుర్తించాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాల రాకను గుర్తించి మావోయిస్టులు పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో వాళ్లను భద్రతా సిబ్బంది వెంబడించారు. శనివారం రాత్రి 8 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు దాదాపు 16 గంటల పాటు ఎన్ కౌంటర్ కొనసాగింది. వేర్వేరు ప్రాంతాల్లో మావోయిస్టుల మృతదేహాలు ఉండడంతో.. బ్యాకప్ బలగాలను పంపించి అడవుల నుంచి డెడ్ బాడీలను బయటకు తెప్పిస్తున్నారు. మృతుల్లో కీలక నేతలు ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
40 రోజుల్లో 86 మంది..
ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన ఎన్ కౌంటర్లలో 86 మంది మావోయిస్టు మృతి చెందారు. 2026 మార్చి నాటికి మావోయిస్టులను అంతం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించిన నాటి నుంచి దండకారణ్యంలో కూంబింగ్ ఆపరేషన్లను ముమ్మరం చేశారు. అబూజ్మఢ్ఏరియా చుట్టూ బేస్‌క్యాంపులను ఏర్పాటు చేశారు. ‘లొంగిపోండి.. లేదంటే చంపేస్తాం’ అంటూ మావోయిస్టులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సంవత్సరం 40 రోజుల వ్యవధిలో జరిగిన ఎన్కౌంటర్లలో 86 మంది మావోయిస్టులు మృతి చెందారు. కాగా, 2024లో జరిగిన ఎన్ కౌంటర్లలో 217 మంది మావోయిస్టులు చనిపోయారు. భద్రతా బలగాల వ్యూహాత్మక దాడులతో మావోయిస్టులు చెల్లాచెదురు అవుతున్నారు. తలదాచుకునేందుకు దండకారణ్యం వదిలి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా నిఘావర్గాలు పేర్కొంటున్నాయి.
ఇది పెద్ద విజయం: అమిత్ షా
ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు మృతి చెందడంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమర జవాన్లకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘‘నక్సల్స్ రహిత భారతదేశాన్ని రూపొందించే దిశగా భద్రతా బలగాలు పెద్ద విజయం సాధించాయి. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం” అని సోషల్ మీడియా ‘ఎక్స్’లో అమిత్ షా పేర్కొన్నారు.
ఈ ఏడాది జరిగిన ఎన్ కౌంటర్ల వివరాలివీ..
తేదీ ప్రాంతం చనిపోయిన మావోయిస్టులు
ఫిబ్రవరి 9 బీజాపూర్ 31
ఫిబ్రవరి 2 గరియాబంద్ 8
జనవరి 20 గరియాబంద్ 16
జనవరి 16 బీజాపూర్ 18
జనవరి 12 బీజాపూర్ 5
జనవరి 9 సుక్మా–బీజాపూర్ 3 బార్డర్
జనవరి 4 అబూజ్ మఢ్ 5