100 శాతం క్లీనింగ్ టార్గెట్.. సిటీలో కొత్తగా 31 ఎస్టీపీలు నిర్మాణాలు

 100 శాతం  క్లీనింగ్ టార్గెట్..  సిటీలో కొత్తగా 31 ఎస్టీపీలు నిర్మాణాలు
  • రాష్ట్ర సర్కార్ రూ. 3866 కోట్లు వ్యయం  
  •  వికేంద్రీకరణ పద్ధతిలో నిర్మిస్తున్న వాటర్ బోర్డు
  •  అందుబాటులోకి వస్తే.. దక్షిణాసియాలోనే తొలి సిటీగా హైదరాబాద్

హైదరాబాద్, వెలుగు:  గ్రేటర్ లో సిటీలో మురుగు నీటి శుద్ధి వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది. రోజూ ఉత్పత్తి అయ్యే మురుగు నీటిని వందశాతం క్లీన్ చేసేందుకు వీలుగా వివిధ ప్రాంతాల్లో  కొత్తగా మురుగు నీటి శుద్ధి కేంద్రాలు(ఎస్టీపీ)లను నిర్మించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. 

ఇందుకు 3 ప్యాకేజీల్లో రూ.3,866.41 కోట్లతో 31 ప్రాంతాల్లో కొత్త ఎస్టీపీల నిర్మాణ బాధ్యతలను మెట్రోవాటర్ బోర్డు చేపట్టింది. వీటిని బోర్డు పరిధిలోని 5 సర్కిళ్లలో నిర్మిస్తున్నారు. అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో నిర్మిస్తోంది. ఇవి పూర్తయి అందుబాటులోకి వస్తే రోజూ ఉత్పత్తి అయ్యే మురుగును 100 శాతం శుద్ధి చేసే తొలి సిటీగా  దక్షిణాసియాలోనే  హైదరాబాద్ చరిత్ర సృష్టిస్తుందని అధికారులు తెలిపారు. 

ఉత్పత్తికి, శుద్ధికి భారీ తేడా ఉండగా..

 కొంతకాలంగా సిటీలో మురుగునీటి శుద్ధి పెద్ద సమస్యగా మారింది. ఉత్పత్తి అయ్యే మురుగుకు, శుద్ధి చేసే నీటికి భారీగా తేడా ఉంది.  దీంతో ఎంత నీటిని క్లీన్ చేసినా రోజురోజుకూ మురుగు పెరుగుతూనే ఉంటోంది.  మూసీలోకి భారీగా వెళ్తుండగా మురికి కూపంగా తయారైంది. ఇక నుంచి నదిలోకి చేరకుండా, ఎక్కడికక్కడ ఎస్టీపీల నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.  కొత్తగా 31 ఎస్టీపీలను ఒక్కో టి 1,259.50 ఎంఎల్డీల సామర్థ్యంతో  నిర్మించనుంది. ఇప్పటికే సిటీలో 25 చోట్ల ఎస్టీపీలు ఉండగా.. వీటి ద్వారా జరిగే మురుగునీటి శుద్ధి  45 శాతం మాత్రమే. 

కొత్త  ఎస్టీపీలను  నిర్మిస్తే సిటీలో ఉత్పత్తి అయ్యే మురుగు పూర్తిగా క్లీన్ అయ్యే  చాన్స్ ఉంటుందని వాటర్​బోర్డు ఒక నివేదికను రూపొందించింది. అందుకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 3,866.41 కోట్లతో ఎస్టీపీలను నిర్మాణాలను చేపట్టింది. వీటిని వికేంద్రీకరణ పద్ధతిలో నిర్మిస్తుండగా.. శుద్ధి చేసిన నీటిని మూసీలోకి విడుదల చేయడమే కాకుండా ఇతర అవసరాలకు కూడా వాడుకునేలా అధికారులు ప్లాన్ చేశారు. ముఖ్యంగా పరిశ్రమల్లోనూ, చెట్లకు శుద్ధి చేసిన నీటిని వాడుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. 

వందశాతం శుద్ధి లక్ష్యంగా..

గ్రేటర్​హైదరాబాద్ అర్బన్ ఆగ్లోమెరేషన్ పరిధిలో ప్రస్తుతం రోజూ 1,950 ఎంఎల్డీల మురుగు ఉత్పత్తి అవుతున్నట్టు  అధికారుల లెక్కల ద్వారా తెలుస్తుంది. బల్దియా పరిధిలో 1,650 ఎంఎల్డీల మురుగు ఉత్పత్తి అవుతుండగా.. ఇప్పటికే ఉన్న 25 ఎస్టీపీల ద్వారా 772 ఎంఎల్డీలు (46 శాతం) మాత్రమే శుద్ధి చేస్తున్నారు. ఇది దేశంలోని ఇతర సిటీలతో పోలిస్తే అధికంగా ఉంది. మిగిలిన 878 ఎంఎల్డీల మురుగును క్లీన్ చేసేందుకు కొత్తగా31 ఎస్టీపీలను నిర్మిస్తోంది. భవిష్య త్ దృష్ట్యా 2036 ఏడాది నాటికి ఉత్పత్తి అయ్యే మురుగును కొత్త ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసేందుకు చాన్స్ ఉంటుంది. 

ఎస్టీపీ నిర్మాణ ప్రాజెక్టుల్లో భాగంగా ప్యాకేజీ –-3 లో నిర్మించే ఫతే నగర్, ఖాజాకుంట ఎస్టీపీలు ఇప్పటికే పూర్తవగా.. వీటిని త్వరలోనే ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే నిర్మించిన 4 ఎస్టీపీలు (కోకాపేట, దుర్గం చెరువు, పెద్ద చెరువు, నల్లచెరువు) ప్రారంభించారు. మరో 6 ఎస్టీపీలు నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి రెడీగా మీరాలం, మియాపూర్-పటేల్ చెరువు, సఫిల్ గూడ, వెన్నెల గడ్డ, నాగోల్ ఎస్టీపీలు ఉన్నాయి. ఆగస్టులో నల్లగండ్ల, ముల్లకత్వ చెరువు, శివాలయ నగర్, పాలపిట్ట వద్ద నిర్మిస్తున్న ఎస్టీపీలను త్వరలో అందుబాటులోకి తెస్తారు.  

3 ప్యాకేజీల్లో ఎస్టీపీల నిర్మాణాలు

ఎస్టీపీల నిర్మాణాలను 3 ప్యాకేజీలుగా విభజించారు.  ఇందులో భాగంగా ప్యాకేజీ –1-లో అల్వాల్, మల్కాజ్ గిరి, కాప్రా, ఉప్పల్ సర్కిల్ ప్రాంతాల్లో రూ.1, 230.21 కోట్లతో 8 ఎస్టీపీలను నిర్మిస్తారు. వీటి ద్వారా 402.50 ఎంఎల్డీల మురుగు శుద్ధి చేసేందుకు చాన్స్ ఉంటుంది. ప్యాకేజీ –2-లో రాజేంద్రనగర్, ఎల్ బీ నగర్ సర్కిల్ ప్రాంతాల్లో రూ.1,355.13 కోట్లతో 6 ఎస్టీపీలను నిర్మిస్తున్నారు. ఇక్కడ 480.50 ఎంఎల్డీల మురుగు శుద్ధి చేస్తారు. ప్యాకేజీ-- –3 లో  కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి సర్కిల్ లో రూ.1,280.87 కోట్లతో 17 ఎస్టీపీలను నిర్మిస్తారు. వీటి ద్వారా రోజుకు 376.50 ఎంఎల్డీల మురుగు నీటిని శుద్ధి చేయనున్నట్టు అధికారులు తెలిపారు.