గుండెపోటుతో మరో యువకుడు ప్రాణం వదిలాడు. ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. కాంగ్రెస్ నాయకుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాధా కిషోర్ కుమారుడు31 ఏళ్ల శ్రీధర్ గుండెపోటు మృతిచెందాడు. సోమవారం (జులై 10న) ఉదయం శ్రీధర్ జిమ్ కు వెళ్లి.. తిరిగి ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత ఛాతీలో నొప్పి వస్తుందని చెబుతూనే ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు.
వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే.. శ్రీధర్ అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఆదివారం (జులై 9న) శ్రీధర్ సోదరుడు కుమారుడి బారసాల జరిగింది. బారసాల కార్యక్రమానికి మాజీ మంత్రి రేణుకచౌదరి కూడా హాజరయ్యారు. రేణుకచౌదరికి రాధా కిషోర్ ముఖ్య అనుచరుడిగా ఉన్నారు.
మరోవైపు.. ఆదివారం (జులై 9న) గరికపాటి నాగరాజు అనే 32 ఏళ్ల వ్యక్తి కూడా గుండెపోటుతో మృతి చెందాడు. ఇలా వరుసగా ఇద్దరు యువకులు గుండెపోటుతో ఖమ్మం నగరంలో మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది.