హైదరాబాద్, వెలుగు:సైబర్ నేరస్థులు కొల్లగొట్టిన డబ్బును తెలంగాణ సైబర్ సెక్యురిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) అధికారులు తిరిగి ఇప్పిస్తుండడంతో బాధితులు ఊరట పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన సైబర్ నేరాలకు సంబంధించి టీజీసీఎస్‌బీ తక్షణం స్పందిస్తూ బాధితుల సొమ్ము సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 20 నుంచి జూన్ 8 వరకు రెండు మెగా లోక్ అదాలత్‌లలో మొత్తం రూ.31.29 కోట్లను రీఫండ్ చేశామని టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (టీఎస్‌ఎల్‌ఎస్‌ఏ), టీజీసీఎస్‌బీ సంయుక్త సహకారంతో ఇది సాధ్యమైందని ఆమె చెప్పారు. సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన సొమ్మును బ్యాంకు ఖాతాల్లో ఫ్రీజ్ చేస్తున్నప్పటికీ బాధితులకు చేరడంలో ఆసల్యం అవుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని లోక్ అదాలత్‌ల ద్వారా వాటిని త్వరితగతిన అందించేందుకు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. 5,142 పిటిషన్లు కోర్టులో నమోదు చేయగా మొత్తం రూ.31.29 కోట్లు బాధితులకు రీఫండ్ చేసేందుకు ఆదేశాలు వచ్చాయని చెప్పారు. సైబర్ బాధితులకు సకాలంలో వారి సొమ్ము తిరిగి వస్తుండడంతో ఊరట లభిస్తోందని శిఖా గోయల్ పేర్కొన్నారు.