హైదరాబాద్, వెలుగు: జీవో 317 కింద గతంలో కొత్త లోకల్ కేడర్లకు కేటాయించిన ఉద్యోగులను స్పౌజ్ కేటగిరీ, పరస్పర బదిలీలు, అనారోగ్య కారణాల కింద వేరే లోకల్ కేడర్లకు మళ్లీ బదిలీ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. 317 జీవో కింద వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి, అర్హత ఉన్నవాటిని ప్రభుత్వానికి పంపాలని.. అందుకు అనుగుణంగా బదిలీ ఉత్తర్వులుంటాయని పేర్కొన్నారు.
స్థానికతపై రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను పాత లోకల్ కేడర్ల నుంచి కొత్త లోకల్ కేడర్లకు గత ప్రభుత్వం కేటాయించింది. ఇందుకోసం 2021 డిసెంబర్ 6న జీవో 317ను జారీ చేసింది. ఈ ప్రక్రియలో తమకు అన్యాయం జరిగిందని సుదూర ప్రాంతాల్లోని కేడర్లకు వెళ్లిన ఉద్యోగులు ఆందోళనకు దిగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి దామోదర రాజనర్సింహా నేతృత్వంలో జీవో 317, జీవో 56 సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉపసంఘం చేసిన సిఫార్సుల మేరకు తాజాగా మూడు కేటగిరీల కింద కేడర్ మార్పునకు అనుమతిచ్చింది.