317 జీఓ బాధితులకు అతి త్వరలో తీపి కబురు: ఎమ్మెల్సీ కోదండరాం

317 జీఓ బాధితులకు అతి త్వరలో తీపి కబురు: ఎమ్మెల్సీ కోదండరాం

ముషీరాబాద్, వెలుగు: ఉద్యోగులకు స్థానికత చాలా కీలకమని, గత ప్రభుత్వం ఈ విషయాన్ని పూర్తిగా విస్మరించిందని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. 317 జీఓతో స్థానికత కోల్పోయిన 31 డిపార్ట్​మెంట్ల ఉద్యోగులు, టీచర్లు సోమవారం సిటీలోని జిల్లా పరిషత్ హాల్‎లో నాగేశ్వరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ కోదండరాంను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 317 జీఓపై దృష్టి పెట్టిందన్నారు. 317 జీఓ బాధితులకు అతి త్వరలోనే తీపి కబురు వస్తుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి తగిన సూచనలు, సలహాలు చేసి సంపూర్ణ న్యాయం చేస్తానని భరోసా కల్పించారు. 

అలాగే ఈ నెల 4న త్యాగరాయ గాన సభలో కోదండరాంకు ఆత్మీయ పౌర సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ జన సమితి అధ్యక్షులు నరసయ్య వెల్లడించారు. సోమవారం ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని ఓ హోటల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కోదండరాంకు సన్మానం చేస్తే తెలంగాణ సమాజానికి సన్మానం చేసినట్లుగా భావిస్తున్నామని తెలిపారు. ఈ సన్మానం సందర్భంగా లోయర్ ట్యాంక్ బండ్ కట్టమైసమ్మ దేవాలయం నుంచి ఇందిరా పార్క్ భీమా మైదానం అశోక్ నగర్ గాంధీ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.