పంజాగుట్ట, వెలుగు: బేగంపేటలోని మహాత్మా జ్యోతిరావ్ ఫూలే ప్రజాభవన్లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి 319 అర్జీలు వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఇందులో రెవెన్యూ 50, మైనారిటీ వెల్ఫేర్61, పంచాయితీ రాజ్ 27, విద్యుత్81, ఆరోగ్యశ్రీ 21, ఇతర శాఖలకు 79 ఫిర్యాదులు అందించినట్టు పేర్కొన్నారు. 2023 లో పోలీసు శాఖలో ఉద్యోగాలకు ఎంపికయ్యామని, కొందరిని శిక్షణకు పిలిచి, మరికొందరిని పిలవలేదని అభ్యర్థులు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చెన్నారెడ్డికి విన్నవించారు.
తమపై చిన్నపాటి కేసులుండగా పిలవలేదని, అయితే ఆ కేసులను 2022 సంవత్సరానికి ముందే కోర్టులు కొట్టివేసినట్టు అభ్యర్థి శివ తెలిపారు. రాష్ట్రంలోని సమగ్ర శిక్షా ప్రాజెక్టులో జిల్లా, మండల స్కూల్కాంప్లెక్స్, పాఠశాల స్థాయిలో వివిధ స్థాయిల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పని చేస్తున్నామని, తమను రెగ్యులరైజ్ చేయాలని, సుప్రీంకోర్టుతీర్పు ప్రకారం టైమ్స్కేలు అమలు చేయాలని కాంట్రాక్ట్ ఉద్యోగి కేశవులు విజ్ఞప్తి చేశారు.