ఎస్సారెస్పీ 32 గేట్లు ఓపెన్.. నిండుకుండలా మారిన ప్రాజెక్టు

 

  • ఎస్సారెస్పీ 32 గేట్లు ఓపెన్.. నిండుకుండలా మారిన ప్రాజెక్టు 
  • గోదావరి ప్రాజెక్టుల గేట్లన్నీ ఖుల్లా 
  • సింగూరు మినహా అంతటా ఓపెన్ 
  • కృష్ణా ప్రాజెక్టులకూ భారీ వరద

హైదరాబాద్/నెట్ వర్క్, వెలుగు:  ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు రాష్ట్రంలో కుంభవృష్టి కురుస్తుండడంతో గోదావరి బేసిన్​లోని సింగూరు మినహా మిగతా అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తారు. ఇదే స్థాయిలో వరద కొనసాగితే శనివారం నాటికి సింగూరు గేట్లు కూడా ఓపెన్​చేసే అవకాశముంది. ఎస్సారెస్పీ నిండుకుండలా మారింది. ప్రాజెక్టు కెపాసీటీ 90.3 టీఎంసీలు కాగా, గురువారం సాయంత్రానికి నీటి నిల్వ 78.022  టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2.92 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతున్నది. దీంతో మొత్తం 42 గేట్లకు గాను 32 గేట్లు ఎత్తి, 3 లక్షల క్యూసెక్కులు కిందికి విడుదల చేస్తున్నారు. రానున్న 24 గంటల్లో ప్రాజెక్టుకు దాదాపు 4 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉండొచ్చని ఎస్సారెస్పీ ఎస్ఈ శ్రీనివాస్​తెలిపారు. 

ఈసారి అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టు త్వరగా నిండుతున్నదని వెల్లడించారు. సాధారణ వర్షాలైతే అక్టోబర్​నెలాఖరు దాకా ఈ స్థాయి నీళ్లు వచ్చేవి కావన్నారు. ఇక కడెం ప్రాజెక్టు గేట్ల పైనుంచి వరద వస్తున్నది. ఇక్కడ 16 గేట్లు ఓపెన్ చేసి, నీళ్లు విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి 35 గేట్లు, మేడిగడ్డ 81 గేట్లు, తుపాకులగూడెం 59 గేట్లు ఓపెన్​చేసి వరదను నదిలోకి వదులుతున్నారు. మిడ్ మానేరుకు లక్షా 5 వేల క్యూసెక్కుల వరద వస్తుండడంతో.. మొత్తం 24 గేట్లకు గాను 22 గేట్లు ఎత్తి లక్షా 10 వేల క్యూసెక్కులు ఎల్ ఎండీకి వదులుతున్నారు. ఎల్ ఎండీకి లక్షా 70 వేల క్యూసెక్కుల వరద వస్తుండడంతో 16 గేట్లు ఓపెన్ చేసి, 56 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గేట్లను గురువారం మంత్రి గంగుల కమలాకర్ ఓపెన్ చేశారు. కాగా, భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకర స్థాయిలోనే ప్రవహిస్తున్నది. అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది.  

జూరాల 7 గేట్లు ఓపెన్.. 

కృష్ణా బేసిన్​లోని ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగుతున్నది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల గేట్లు ఓపెన్​ చేశారు. తుంగభద్రకు భారీగా వరద వచ్చి చేరుతోంది. జూరాలకు 42 వేల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో 7 గేట్లు ఎత్తి 72 వేల క్యూసెక్కులు కిందికి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద పెరుగుతున్నది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 73,973 క్యూసెక్కులుగా ఉంది. శుక్రవారం ఉదయానికి ప్రాజెక్టులోకి లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్​ఫ్లో వచ్చే అవకాశముంది. 

ALSO READ:సిటీ వరదల్లో ఉంటే మంత్రి కేటీఆర్ ఏం చేస్తున్నరు: రేవంత్​

  • ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టుల పరిశీలనకు సెంట్రల్ టీమ్ 
  • ఇయ్యాల రాష్ట్రానికి సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్యానల్​ సభ్యులు 

హైదరాబాద్, వెలుగు: సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్యానల్​సభ్యులు శుక్రవారం శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టులను సందర్శించనున్నారు. డ్యామ్ రిహాబిలిటేషన్ ​అండ్ ​ఇంప్రూవ్​మెంట్ ​ప్రాజెక్టు (డ్రిప్) లో భాగంగా ఈ ప్రాజెక్టుల రిపేర్లు, ఇతర పనులు చేయాల్సి ఉంది. గతేడాది భారీ వరదలు పోటెత్తడంతో కడెం ప్రాజెక్టు స్పిల్​వేతో పాటు కట్ట దెబ్బతింది. 

ఎస్సారెస్పీ నిర్మించి 60 ఏండ్లు కావడంతో దాన్ని బలోపేతం చేసేందుకు పలు పనులు చేయాలని డ్యామ్ సేఫ్టీ ప్యానల్​గతంలోనే పలు సూచనలు చేసింది. కానీ వాటిని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేదు. కడెం ప్రాజెక్టు గేట్లలో రెండు గేట్ల రోప్ లు తెగిపోగా, ఇంకో రెండు గేట్ల కౌంటర్​వెయిట్లు కొట్టుకుపోయాయి. దీంతో ఆయా గేట్లు ఓపెన్​కాక ప్రాజెక్టు గేట్లపై నుంచి వరద ప్రవహించింది. ఈ నేపథ్యంలో ఈ రెండు డ్యామ్ లను పరిశీలించి అవి దెబ్బతినకుండా చేపట్టాల్సిన చర్యలపై డ్యామ్ సేఫ్టీ ప్యానల్​ సూచనలు చేయనుంది.