
- రేపటి నుంచి ఎంసెట్.. అటెండ్ కానున్న 3.2 లక్షల మంది స్టూడెంట్లు
- ఏపీ నుంచి 72,217 మంది అప్లై.. వారి కోసం ఆ రాష్ట్రంలోనే 33 కేంద్రాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బుధవారం నుంచి టీఎస్ఎంసెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఐదు రోజులపాటు ఆన్లైన్లో జరిగే పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 3,20,766 మంది స్టూడెంట్లు పరీక్షలు రాయనున్నారు. ఇంజినీరింగ్ స్ర్టీమ్ లో 2,05,405 మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ర్టీమ్‌లో 1,15,361 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికోసం 137 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తంగా టీఎస్‌ఎంసెట్‌కు తెలంగాణ నుంచి 2,48,549 మంది దరఖాస్తు చేసుకోగా.. వీరి కోసం104 సెంటర్లను మన రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. ఏపీకి చెందిన 72,217 మంది కూడా దరఖాస్తు చేసుకోవడంతో.. వారి కోసం ఏపీలో 33 పరీక్షా కేంద్రాలు పెట్టారు.
రోజూ రెండు సెషన్లు
ఈనెల10 నుంచి14 దాకా ఎంసెట్ కొనసాగనుంది. 10,11 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ర్టీమ్‌కు, 12, 13, 14 తేదీల్లో ఇంజనీరింగ్ స్ర్టీమ్‌కు పరీక్షలుంటాయి. రోజూ రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా ఓ సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరో సెషన్ కొనసాగనున్నది. పరీక్ష ప్రారంభానికి గంటన్నర ముందే కేంద్రంలోకి స్టూడెంట్లను అనుమతిస్తారు. ఎంసెట్‌కూ నిమిషం నిబంధన ఉందని, పరీక్షా కేంద్రానికి ముందుగానే చేరుకోవాలని ఎంసెట్ అధికారులు విజయకుమార్ రెడ్డి, దీన్ కుమార్ తెలిపారు.