
హనుమకొండ జిల్లా ఖాజీపేట మండలం భట్టుపల్లి SR ప్రైమ్ స్కూల్లో ఫుడ్ పాయిజన్‌తో 32 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. జులై 16వ తేదీ ఆదివారం రాత్రి నుంచే విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి చికెన్ తిన్న వెంటనే విద్యార్థులు వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. దీంతో విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా మారటంతో.. అస్వస్థతకు గురైన స్టూడెంట్స్ ను ఆసుపత్రికి తరలించారు. 16 మంది విద్యార్థులకు ఫాదర్ కొలంభో ఆసుపత్రిలో చికిత్స జరుగుతుండగా...మరో 16 మందికి జయ ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. వీరిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
బాధిత విద్యార్థుల్లో కొంత మంది కడుపు నొప్పి భరించలేక అవస్థలు పడుతున్నారు. మరికొంత మంది విద్యార్థినులకు వెంటిలేటర్ మీద శ్వాస అందిస్తున్నారు. తమ పిల్లలకు ఫుడ్ పాయిజన్ కావడంతోపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనతో ఇప్పటికే SR ప్రైమ్ స్కూల్ హాస్టల్ ను సగానికి పైగా విద్యార్థులు ఖాళీ చేశారు. ఈ సంఘటనపై పలు విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి.