తెగిన చెరువు కట్ట..320 ఎకరాల్లో పంట నష్టం

తెగిన చెరువు కట్ట..320 ఎకరాల్లో పంట నష్టం

మహబూబ్​నగర్​/నవాబ్​పేట, వెలుగు: పుండు ఒకచోట అయితే మందు మరోచోట పెట్టినట్లుంది ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్ల తీరు. మహబూబ్​నగర్​ జిల్లా నవాబ్​పేట మండల పరిధిలోని యాన్మన్ గండ్ల చెరువు కట్ట వీక్‌‌‌‌‌‌‌‌గా ఉంటే..తూముకు రిపేర్లు చేశారు. పైగా పూడిక తీత పేరిట కట్ట పొంటి ఒండ్రు మట్టిని తీశారు. కట్ట తెగేటట్లుందని, వెంటనే రిపేర్లు చేయాలని రైతులు మూడునెలల క్రితమే స్థానిక ఆఫీసర్లను కోరినా చర్యలు తీసుకోలేదు. జిల్లా స్థాయి ఆఫీసర్లకు ఎస్టిమేషన్లు పంపగా వాళ్ల నుంచి స్పందన రాలేదు. దీంతో కట్ట మరింత బలహీనంగా మారి రెండ్రోజుల క్రితం వచ్చిన వరదకు తెగిపోయింది. ఫలితంగా చెరువు మొత్తం ఖాళీ కావడమే కాకుండా..దిగువన ఉన్న 320 ఎకరాల్లో పంటలు నాశనం అయ్యాయి. 

120 ఏళ్ల క్రితం నిర్మించిన చెరువు

యన్మన్​గండ్ల పెద్ద చెరువును 120 ఏండ్ల కిందట నిజాం కాలంలో కట్టించారు. ఈ చెరువు కింద చెన్నారెడ్డిపల్లి, ఇప్పటూరు, రుక్కంపల్లి, నవాబ్​పేట, యన్మన్​గండ్ల గ్రామాల పరిధిలోని 450 ఎకరాల్లో పంటలు సాగవుతాయి. 30 సంవత్సరాల కిందట చెరువు కట్టకు ఒకసారి గండి పడితే తూమును ఏర్పాటు చేశారు. 2016లో రెండో విడత ‘మిషన్​ కాకతీయ’ కింద రూ.80 లక్షలతో చెరువులో పూడిక పనులు చేపట్టారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్​ కాకుండా అప్పట్లో ఇక్కడ వీఆర్వోగా పని చేసిన వ్యక్తి సబ్‌‌‌‌‌‌‌‌ కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ తీసుకొని పనులు చేయించాడు. ఈయన కట్ట పొంటి మట్టిని తీయించాడు కానీ కట్టను పటిష్టం చేయలేదు.  బిల్లులు మాత్రం డ్రా చేసుకున్నాడు. మూడేళ్ల వరకు వానలు లేకపోవడంతో ఇబ్బంది రాలేదు కానీ, 2020-21, 2021-22లో కురిసిన వర్షాలకు చెరువుకు భారీగా వరద వచ్చింది.  గతేడాది చెరువు ఫుల్​ స్టోరేజీకి చేరి ప్రమాదకరంగా అలుగు పోసింది. అప్పుడే కట్టకు ప్రమాదం ఉందని గుర్తించిన పరిసర గ్రామాల రైతులు, వెంటనే రిపేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని లోకల్‌‌‌‌‌‌‌‌ ఇరిగేషన్​ఆఫీసర్లకు తెలిపారు.  మూడు నెలల కింద వినతి పత్రం కూడా ఇచ్చారు. వీళ్లు  ఎస్టిమేషన్లు తయారు చేసి జిల్లా స్థాయి ఆఫీసర్లకు పంపారు. కానీ, కట్టకు కాకుండా తూము, మైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిపేర్లు చేయాలని ఎమర్జెన్సీ వర్క్​కింద రూ.10 లక్షలతో అనుమతులు ఇచ్చారు. 

రైతులకు కోలుకోలేని దెబ్బ

ఎగువ నుంచి వచ్చిన వరదను తట్టుకోలేక సోమవారం సాయంత్రం చెరువుకు గండి పడడంతో  320 ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి.  ఇందులో 290 ఎకరాల్లో వరి, 30 ఎకరాల్లో మక్క చేన్లు ఉన్నాయి. చెరువుకు దగ్గర్లో ఉన్న 180 ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి.  మిగతా చోట్ల  పొలాల్లో చెత్త, బురద పేరుకుపోయింది.  రైతులు ఇప్పటికే ఎకరా వరి సాగుకు రూ.25 వేలు , మక్కలపై ఎకరాకు రూ.15 వేల పెట్టుబడి పెట్టారు. ఈ లెక్కన వరి రైతులకు రూ.72.50 లక్షలు, మక్క రైతులకు రూ.4.50 లక్షల నష్టం వాటిల్లింది. ఇసుక మేటలు, బురద తొలగించేందుకు ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రా ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి. 

పంట మొత్తం పోయింది

చెరువు కింద నాకు ఆరు ఎకరాల పొలం ఉంది. రూ.1.50 లక్షల పెట్టుబడి పెట్టి ఈ సీజన్​లో మొత్తం చేనులో 15 రోజుల కిందటే వరి నాట్లు వేసిన. చెరువుకు గండి పడి మొత్తం కొట్టుకుపోయింది. ఆఫీసర్లు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి మేం లాస్​ కావాల్సి వచ్చింది. ప్రభుత్వమే ఆదుకోని పంట నష్ట పరిహారం ఇయ్యాలె.
- జుర్కి వెంకటయ్య, రైతు, రుక్కంపల్లి

నారు కొట్టుకుపోయింది

చెరువు కింద నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. వారం కిందటే వరి నాట్లు పోసిన. చెరువు గండి పడి ఆ నీరంతా నా పొలం మీదుగా పోయింది. దీంతో పొలంలో భారీగా బుదర చేరింది. నారు  మొత్తం కొట్టుకుపోయింది. పొలం వ్యవసానికి పనికి రాకుండా పోయింది.  పంటపై పెట్టిన పెట్టుబడి మొత్తం నీళ్ల పాలైంది. బురద తీసేందుకు ఇప్పుడు ఎక్స్​ట్రా ఖర్చు చేయాలె. 
- బుడ్డయ్య, రైతు, రుక్కంపల్లి

బాధితులను ఆదుకుంటాం

యన్మన్ ​గండ్ల పెద్ద చెరువు కట్ట తెగిపోవడం దురదృష్టకరమని,  బాధిత రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం గండి పడ్డ చెరువును పరిశీలించారు.  జిల్లా ఆఫీసర్లతో మాట్లాడి వీలైనంత త్వరగా  కట్టను మళ్లీ నిర్మిస్తామని చెప్పారు. పంటనష్టంపై ఆఫీసర్ల రిపోర్ట్‌‌‌‌ రాగానే  ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.