యాదాద్రిలో 323 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

యాదాద్రి, వెలుగు : జిల్లావ్యాపంగా 323 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎంఏ కృష్ణన్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై ఐకేపీ, సీసీలు, మెప్మా, సెంటర్ల నిర్వాహకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 1న ప్రతి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని​ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.  

ఏప్రిల్15 నాటికి జిల్లాలో మొత్తం 323 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. వీటిలో 85 ఐకేపీ సెంటర్లు ఉంటాయని చెప్పారు. నాణ్యతా ప్రమాణాలకు లోబడి వడ్లను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో మద్దతు ధర లభించేలా అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం 'ఏ' గ్రేడ్ క్వింటాల్​కు

రూ.2203, సాధారణ రకానికి రూ.2183- మద్దతు ధర ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో రైతులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. సమావేశంలో డీసీఎస్​వో శ్రీనివాస్ రెడ్డి, సివిల్ సప్లై డీఎం గోపీకృష్ణ, అడిషనల్ పీడీ శ్రీనివాస్, డీపీఎం సునీల్ పాల్గొన్నారు.