మద్యం మత్తులో బీఆర్ఎస్ కౌన్సిలర్ వీరంగం

జగిత్యాల జిల్లా : జగిత్యాల పట్టణంలో 32వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ గంగమల్లు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. అధికార పార్టీ కౌన్సిలర్ నే ఆపుతారా..? అంటూ పోలీసులతో గొడవకు దిగాడు. మీ ఉన్నతాధికారులకు చెప్పి.. సంగతి చూస్తానంటూ పోలీసులను హెచ్చరించాడు. 

అసలేం జరిగింది..? 

జగిత్యాల పట్టణంలోని అన్నపూర్ణ చౌరస్తాలో పోలీసులు రాత్రి సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. ఈ క్రమంలోనే జగిత్యాల పట్టణానికి చెందిన కోర్రె గంగమల్లును కూడా పోలీసులు ఆపారు. దీంతో అధికార పార్టీ కౌన్సిలర్ నే ఆపుతారా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. దాదాపు 30 నిమిషాల పాటు కౌన్సిలర్ గంగమల్లు రోడ్డుపైనే నానా హంగామా చేశాడు. 

పోలీసులు ఆపడంతో జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు ఫోన్ చేశానని, అప్పుడు ఎమ్మెల్యే కూడా తనను విడిచిపెట్టాలని సీఐకి చెప్పినా.. పోలీసులు పట్టించుకోలేదని గంగమల్లు ఆరోపించాడు. తనను బీఆర్ఎస్ పార్టీ నుండి బహిష్కరించేందుకే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను పోలీసులు తమ సెల్ ఫోన్లలో రికార్డు చేశారు. తమను గంగమల్లు దుర్భాషలాడారని పోలీసులు ఆరోపించారు.