ఖమ్మం జిల్లాలో కబ్జారాయుళ్ల బరితెగింపు

ఖమ్మం జిల్లాలో కబ్జారాయుళ్ల బరితెగింపు
  • ఖమ్మం జిల్లాలో కబ్జారాయుళ్ల బరితెగింపు
  • దేవాలయాల భూములే టార్గెట్
  • కుదిరితే కబ్జా.. లేదంటే మట్టి తవ్వకాలు 
  • ముదిగొండ మండలం సువర్ణపురంలోని 33 ఎకరాల దేవుడు మాన్యం ఆక్రమణ
  • ఆక్రమణలు గుర్తించి బోర్డులు ఏర్పాటు చేసిన అధికారులు
  • తెల్లారేసరికి  బోర్డులు మాయం చేసిన కబ్జాదారులు

ఖమ్మం/ముదిగొండ/కూసుమంచి, వెలుగు: ఖమ్మం జిల్లాలో కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారు. దేవాదాయ శాఖ భూములను టార్గెట్ చేస్తున్నారు. కుదిరితే కబ్జా పెడుతున్నారు. లేదంటే దేవుడు మాన్యం మట్టిని అమ్ముకుంటున్నారు. దేవాదాయ శాఖ అధికారులు కబ్జాలను గుర్తించి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నప్పటికీ, వాటిని తొలగించి మరీ పొతం పట్టిస్తున్నరు. కొన్నేండ్లుగా కొనసాగుతున్న భూకబ్జా బాగోతాలు ప్రభుత్వం మారడంతో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కూసుమంచి మండలం జీళ్లచెర్వు సీతారామచంద్రస్వామి ఆలయ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపిన నలుగురిని గురువారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. వారిలో బీఆర్ఎస్​ నేత, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్​కూడా ఉన్నారు. మరోవైపు ముదిగొండ మండల కేంద్రం శివారులోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చెందిన భూములు క్రమంగా అన్యాక్రాంతం అవుతున్నాయి. ఆలయ భూముల్లో సంబంధిత అధికారులు బుధవారం ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను తెల్లారే సరికి మాయం చేశారు. తొలగించిన వారిపై దేవాదాయ శాఖ అధికారులు చర్యలకు 
సిద్ధమవుతున్నారు. 

గుడికి వెళ్లే దారినీ వదల్లే..

ముదిగొండ శివారులోని వృద్ధగిరికొండపై ఉన్న శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయ పరిసరాల్లో 33.26 ఎకరాల దేవుడి మాన్యం ఉంది. ఈ భూములను ఆనుకొని  కోదాడ, కురవి నేషనల్​హైవే 365 ఉంది. ఇక్కడ ఎకరా భూమి రూ.కోటికి పైగా పలుకుతోంది. దీంతో కొందరు అక్రమార్కుల కన్ను ఆలయ భూములపై పడింది. మట్టికి, రాళ్లకు కూడా డిమాండ్​ఉండడంతో ఎవరికి దొరికింది వాళ్లు దండుకున్నారు. చివరికి గుడికి వెళ్లే దారిని కూడా కబ్జా చేశారు. 10 అడుగుల లోతు తవ్వి మట్టిని అమ్ముకున్నారు. ఈ వ్యవహారంపై ఇటీవల కొందరు స్థానికులు జిల్లా కలెక్టర్​వీపీ గౌతమ్​కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో దేవాదాయ శాఖ అధికారులు దేవుడి మాన్యం భూముల సర్వే చేపట్టారు. సర్వే నం.308లో 7.23 ఎకరాలు, సర్వే నం.309లో14.28 ఎకరాలు, సర్వే నం.310 లో 11.15 ఎకరాలు ఉండగా, మొత్తంగా 33.26 ఎకరాల దేవుడి మాన్యం ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. వాటిలో బుధవారం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే గురువారం తెల్లారేసరికి ఆ బోర్డులను గుర్తుతెలియని వ్యక్తులు తొలగించారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎండోమెంట్ అధికారులు చెబుతున్నారు. 

డీసీసీబీ డైరెక్టర్ ​అరెస్ట్

బీఆర్ఎస్​ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని జీళ్లచెర్వు ఆలయ భూముల్లో మట్టిని అక్రమంగా తవ్వి, అమ్ముకున్నారన్న ఫిర్యాదుపై డీసీసీబీ డైరెక్టర్, బీఆర్ఎస్​నేత ఇంటూరి శేఖర్​ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది జరిగిన అక్రమ తవ్వకాలపై స్థానికుల ఫిర్యాదుతో ఇటీవల రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్, దేవాదాయ శాఖ అధికారులు ఉమ్మడి విచారణ నిర్వహించారు. 18.25 ఎకరాల్లో అక్రమ తవ్వకాలను నిర్దారించి, రూ.61.29 లక్షల విలువైన రూ.3.60 మెట్రిక్​ టన్నుల మట్టిని తవ్వారని తేల్చారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్​సులోచన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, ఇంటూరి శేఖర్ తోపాటు జీళ్లచెర్వు శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయ చైర్మన్​చెన్నవెంకన్న, డైరెక్టర్లు కొండ వెంకన్న, చింతలపాటి రామకృష్ణను బుధవారం అర్ధరాత్రి అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.

ఫేక్​ డాక్యుమెంట్లతో పరిహారం పొందిన్రు

ముదిగొండలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ భూములను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. హైవే నిర్మాణంలో పోయిన దేవాలయ భూములకు కొందరు తప్పుడు పేపర్లు సృష్టించి పరిహారం పొందారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి అక్రమంగా పరిహారం పొందిన వారిపై, సహకరించిన ఆఫీసర్లపై చర్యలు చేపట్టాలి.
- కొమ్ము నర్సింహారావు, ముదిగొండ

బోర్డులు తొలగించినోళ్లపై చర్యలు తీస్కుంటం

ముదిగొండ దేవుడి మాన్యంలో హెచ్చరిక బోర్డులను తొలగించిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటాం. రాత్రికి రాత్రే బోర్డులను తొలగించడంపై ఉన్నతాధికారులకు సమాచారమిచ్చాం. దేవాలయాల భూములు కబ్జా కాకుండా, అక్రమార్కుల బారిన పడకుండా కాపాడతాం. మిగిలిన భూముల్లోనూ సర్వే చేసి దేవాలయ భూములను పరిరక్షించేలా చర్యలు తీసుకుంటాం. 
- నారాయణాచార్యులు, ఎండోమెంట్ ఆఫీసర్