దేశంలో మరణాలు 600కు చేరువలో
మొత్తంగా 18,539కి చేరిన కేసులు.. ఒక్కరోజే 1,235
మహారాష్ట్రలో నాలుగున్నర వేలు దాటిన కేసులు.. 232 మంది మృతి
ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్లోనూ ఇదే పరిస్థితి
దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. మృతుల సంఖ్య 592కు చేరింది. ఇందులో 33 మంది ఒక్క సోమవారమే చనిపోయారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 18,539 కరోనా కేసులు నమోదవగా.. ఇందులో 1,235 కేసులు ఒక్కరోజే పెరిగాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్లలో పరిస్థితి దారుణంగా తయారవుతోంది. వీటితో కలిపి ఏడు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటిపోయింది. ఒక్క ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశమంతటా వైరస్ ఎఫెక్ట్ పెరుగుతోంది. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై సహా మహారాష్ట్రలోని ప్రధాన నగరాల్లో కరోనా వ్యాప్తి భారీగా పెరిగింది. సోమవారం ఒక్కరోజే ఈ రాష్ట్రంలో కొత్తగా 466 కేసులు నమోదవగా, 9 మంది మరణించారు. మొత్తంగా మహారాష్ట్రలో కేసుల సంఖ్య 4,666కు చేరగా, మృతుల సంఖ్య232కు పెరిగింది. అక్కడ ఇప్పటివరకు 572 మంది రికవరీ అయ్యారు.
పెరుగుతున్న రికవరీలు
ఓ వైపు కరోనా వైరస్ కేసులు భారీగా నమోదవుతుండగా రికవరీలు కూడా పెరుగుతున్నాయి. సోమవారం దేశవ్యాప్తంగా 419 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 3,273కు పెరిగింది.
For More News..