హైదరాబాద్, వెలుగు: ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్ రాజ్ హెచ్చరించారు. కోడ్ అమలు విషయంలో అధికారులందరూ కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర పోలీసులతో పాటు దాదాపు 3,350 మంది కేంద్ర పారా మిలిటరీ సిబ్బంది మునుగోడు బై ఎలక్షన్ డ్యూటీలో ఉంటారని చెప్పారు. ఉప ఎన్నికకు మొత్తం 289 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో వికాస్‌రాజ్ పేర్కొన్నారు. ఇందులో 105 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి తగిన చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఇక్కడ రాష్ట్ర, కేంద్ర పోలీసు బలగాలను ఎక్కువ సంఖ్యలో నియమిస్తామని చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక వీవీప్యాట్‌తో పాటు మూడు ఈవీఎంలు ఉంటాయని వివరించారు. ఒక్కో ఈవీఎంలో 16 మంది అభ్యర్థుల పేర్లకు మాత్రమే అవకాశం ఉంటుందని, బరిలో మొత్తం 47మంది ఉండటంతో మూడు ఈవీఎంలు పెట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. టెక్నికల్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని 35% మేర ఈవీఎంలు, వీవీప్యాట్‌లను జిల్లా ఎన్నికల అధికారి పర్యవేక్షణలో రిజర్వ్‌లో ఉంచినట్లు తెలిపారు.
రూ.2.49 కోట్లు పట్టుకున్నం..
ఇప్పటిదాకా 12 కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు చేశామని వికాస్ రాజ్ తెలిపారు. సుమారు రూ.2.49 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో మద్యం వినియోగం ఎక్కువగా జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఓటర్లను ప్రలోభ పెడుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఎక్సైజ్‌శాఖ నుంచి అదనంగా 128 మంది సిబ్బందిని రంగంలోకి దించినట్లు తెలిపారు. పదుల సంఖ్యలో బెల్టు షాపులను క్లోజ్ చేశామని, 58 కేసులు నమోదు చేసి 24 మందిని అరెస్టు చేశామన్నారు. 24 గంటలూ పనిచేసే హెల్ప్ లైన్ సెంటర్ (08681-2230198)ను ఏర్పాటు చేశామని, ఎలాంటి ఫిర్యాదులున్నా సంప్రదించవచ్చని తెలిపారు.