- హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌లోనే ఎక్కువ
- రాష్ట్రంలోని మొత్తం కుటుంబాల్లో 30 శాతానికి పైగా ఇక్కడే..
- ఉద్యోగాలు, ఉపాధి కోసం భారీగా వలసలు
- అత్యల్పంగా ములుగులో 98,080 ఫ్యామిలీలు
- సమగ్ర సర్వేలో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మొత్తం కుటుంబాల్లో 30 శాతానికి పైగా మూడు జిల్లాల్లోనే ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరిలో కలిపి 34.88 లక్షల ఫ్యామిలీలు ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 6 నుంచి సమగ్ర సర్వే ప్రారంభించిన ప్రభుత్వం.. జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా ఇండ్లకు ప్రత్యేక నెంబర్లు కేటాయించి వివరాలు సేకరిస్తున్నది. జీహెచ్ఎంసీతో పాటు జిల్లాల వారీగా కుటుంబాల సంఖ్యను సర్కార్ఆదివారం వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం కోటి 16 లక్షల 41 వేల 17 ఫ్యామిలీలు ఉన్నట్టు తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లోనే 34.88 లక్షల ఫ్యామిలీలు ఉన్నట్టు చెప్పింది. ఇందులో జీహెచ్ఎంసీలో 25,05,517, రంగారెడ్డిలో 6,04,421, మేడ్చల్ లో 3.79 లక్షల కుటుంబాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఉద్యోగాలు, ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వలస రావడంతోనే ఈ జిల్లాల్లో కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపారు. వీరిలో 70 శాతం మందికి సొంత ఇండ్లు లేవని, వాళ్లందరూ అద్దెకు ఉంటున్నారని చెప్పారు. ఇక నల్గొండ జిల్లాలో 5 లక్షల 7 వేల 569 ఫ్యామిలీలు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో ఖమ్మం (4.71 లక్షలు), నిజామాబాద్(4.68 లక్షలు), సంగారెడ్డిలో (4.24 లక్షలు) ఉన్నాయి. అతి తక్కువగా ములుగులో కేవలం 98 వేల 80 ఫ్యామిలీలు ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఇది అడవికి దగ్గరగా ఉండడంతో వలసదారులు వచ్చే అవకాశం లేదని తెలిపింది.
పట్టణీకరణ పెరుగుతున్న జిల్లాల్లో ఎక్కువ..
రాష్ట్రంలో పట్టణీకరణ ఎక్కువగా పెరుగుతున్న జిల్లాల్లో ఫ్యామిలీల సంఖ్య ఎక్కువగా ఉన్నది. ఉద్యోగాలు, ఉపాధి కోసం ఈ జిల్లాలకు జనం వలస వస్తుండడంతో కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు తేలింది. కొంతమంది పిల్లల చదువుల కోసం కూడా జిల్లాలు మారుతున్నారు. డెవలప్మెంట్, యాక్సెసిబులిటీ ఎక్కువగా ఉండటంతో కుటుంబాల సంఖ్య పెరిగినట్టు తెలుస్తోంది. ఈ లిస్ట్‌లో 11 జిల్లాల పైనే ఉన్నాయి. అందులో నాలుగు జిల్లాల్లో 4 లక్షల పైన కుటుంబాలు ఉన్నాయి. మిగతా వాటిలో జగిత్యాలలో 3.36 లక్షలు, కామారెడ్డిలో 3.01 లక్షలు, సూర్యాపేటలో 3.69 లక్షలు, కరీంనగర్ లో 3.32 లక్షలు, భద్రాద్రి కొత్తగూడెంలో 3.36 లక్షలు, సిద్దిపేటలో 3.25 లక్షలు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 3.79 లక్షల ఫ్యామిలీలు ఉన్నాయి.
యావరేజ్‌గా 2 లక్షల కుటుంబాల పైనే..
రాష్ట్రంలో ప్రతి జిల్లాను పరిగణనలోకి తీసుకుంటే యావరేజ్‌గా 2 లక్షలకు పైనే కుటుంబాలు ఉన్నాయి. హడావుడిగా ఎలాంటి శాస్ర్తీయత లేకుండా ఏర్పాటు చేసిన కొన్ని చిన్న జిల్లాల్లోనే తక్కువ ఫ్యామీలీలు ఉన్నట్టు ప్రభుత్వం రిపోర్టులో పేర్కొన్నది. ఉదాహరణకు జనగాం జిల్లాలో 1,64,532 ఫ్యామిలీలు మాత్రమే ఉన్నాయి. జోగులాంబ గద్వాలలో 1,68,916, జయశంకర్భూపాలపల్లిలో 1,39,807, వనపర్తిలో 1,54,793, నారాయణపేట జిల్లాలో 1,55,999, రాజన్న సిరిసిల్లలో 1,92,432 కుటుంబాలు ఉన్నట్టు వెల్లడించింది. మెదక్, యదాద్రి భువనగిరి, మంచిర్యాల, మహబూబ్‌నగర్, మహబూబాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్, నిర్మల్, వరంగల్, వికారాబాద్, హనుమకొండ జిల్లాల్లో 2 లక్షలపైన కుటుంబాలు ఉన్నాయి. ఇక సర్వే తరువాత కొన్ని జిల్లాల్లో కుటుంబాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కొన్ని కుటుంబాలు సర్వే సమయంలో వేర్వురుగా నమోదు చేయించుకుంటుడంతో కొంతమొత్తంలో పెరిగే చాన్స్ఉందని పేర్కొంటున్నారు.