34 నామినేషన్లు తిరస్కరణ

34 నామినేషన్లు తిరస్కరణ
  •     కరీంనగర్​లో 32 గ్రాడ్యుయేట్, ఒక టీచర్, నల్గొండలో ఒక నామినేషన్  రిజెక్ట్

కరీంనగర్/నల్గొండ, వెలుగు : మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్  ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికల్లో భాగంగా మంగళవారం నామినేషన్ల స్క్రూట్నీ పూర్తయింది. గ్రాడ్యుయేట్  స్థానానికి 100 మంది నామినేషన్లు వేయగా, 32 మంది నామినేషన్లు వివిధ కారణాలతో ఎన్నికల రిటర్నింగ్  ఆఫీసర్  రిజెక్ట్  చేశారు. 

సరైన ఫార్మాట్ లో ఉన్న 68 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి. అలాగే ఉపాధ్యాయ స్థానానికి సంబంధించి 17 మంది నామినేషన్లు దాఖలు చేయగా, ఒకరి నామినేషన్  తిరస్కరణకు గురైంది.16 మంది నామినేషన్లు ఆమోదించారు. 

నల్గొండలో ఒక నామినేషన్..

వరంగల్, -ఖమ్మం, -నల్గొండ టీచర్  ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల స్కూట్నీని అధికారులు పూర్తి చేశారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు, రాష్ట్ర పర్యావరణ, అటవీ,సైన్స్ అండ్  టెక్నాలజీ ప్రిన్సిపల్  సెక్రటరీ అహ్మద్  నదీమ్  సమక్షంలో నల్గొండ  కలెక్టర్  ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో నామినేషన్లను పరిశీలించారు. 

23 మంది అభ్యర్థులు50  నామినేషన్  సెట్లను దాఖలు చేయగా, ఇండిపెండెంట్  అభ్యర్థి తుండు ఉపేందర్  నామినేషన్ పత్రాలపై సంతకం లేని కారణంగా తిరస్కరించారు. మిగిలిన 22 మంది అభ్యర్థులు సక్రమంగా ఉన్నట్లు ప్రకటించారు.