యాదాద్రి, వెలుగు: పిల్లలు లేని జంటలకు ఎదురుచూపులే మిగులుతున్నాయి. పిల్లల కోసం సెంట్రల్అడాప్షన్రిసోర్స్ఆథారిటీ (కారా)లో దత్తత కోసం అప్లయ్ చేసుకుంటున్నారు. రూల్స్ప్రకారం అప్లికేషన్చేసుకున్న దంపతుల్లో సీనియారిటీ ప్రకారం చిన్నారులను దత్తత ఇస్తారు. అయితే మూడు నుంచి నాలుగేండ్ల నుంచి పిల్లల కోసం 'కారా'కు అప్లయ్చేసుకొని ఎదురు చూస్తున్నారు.
ఆరు జంటల్లో ఒక జంటకు సంతాన లేమి..
పెండ్లి అయిన కొన్ని జంటలు త్వరగా సంతానం కావాలని కోరుకుంటుంటే.. మరికొన్ని జంటలు ఇప్పుడే ఎందుకని వాయిదా వేస్తుంటాయి. ఏది ఏమైనా ఇటీవలి కాలంలో చాలా మంది దంపతులకు సంతానం కలగడం లేదు. ప్రతి ఆరు జంటల్లో ఒక జంటకు సంతానం కలగడం లేదని ఒక అధ్యయనంలో తేలింది. వివిధ కారణాలతో పిల్లలు కలగడం లేదని డాక్టర్లు చెబుతున్నారు.
దత్తత కోసం మొగ్గు..
సంతానం కలగని దంపతులు సంతాన సాఫల్య కేంద్రాల వైపునకు వెళ్తుంటే.. మరికొందరు దత్తత వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో ఎక్కువ మంది సంతానం కలిగిన వారి నుంచి దత్తత తీసుకునే వారు. కేంద్ర శిశు సంక్షేమ శాఖ అక్రమ దత్తత తీసుకోవడాన్ని అరికట్టడంతో పాటు చట్టబద్దంగా దత్తత అవకాశాన్ని కల్పించడంలో భాగంగా1990లో సెంట్రల్అడాప్షన్ రిసోర్స్ఆథారిటీ (కారా)ని ఏర్పాటు చేసింది. పిల్లలు కావాల్సిన వారు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్చేసుకొని తమకు సంబంధించిన ఆరోగ్య, ఆర్ధిక అంశాల పూర్తి వివరాలను జత చేయాల్సి ఉంటుంది.
ఏండ్లుగా వెయిటింగ్..
సంతాన లేమి సమస్య కారణంగా దత్తతకు డిమాండ్పెరుగుతోంది. చిన్నారులు తక్కువగా ఉండడం, దత్తత కోసం అప్లయ్ చేసుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడమే ఆలస్యానికి కారణమవుతోంది. దత్తతకు అప్లయ్ చేసుకున్న చేసుకున్న వారు తమ సీరియల్కోసం ఏండ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. ఒక్కో జంట అప్లయ్ చేసుకొని మూడు, నాలుగేండ్లవుతున్నా వారికి అవకాశం రావడం లేదు.
దత్తత తీసుకోవడానికి దేశ వ్యాప్తంగా పిల్లలు లేని వాళ్లు 34 వేల మంది 'కారా'కు అప్లయ్ చేసుకున్నారు. అయితే దేశంలోని శిశు గృహల్లో 2,400 మంది చిన్నారులు మాత్రమే అందుబాటులో ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణలో 1,500 మంది వరకు దత్తత కోసం అప్లయ్ చేసుకోగా, ఇందులో యాదాద్రి జిల్లాకు చెందిన 53 మంది ఉన్నారు.
చట్ట ప్రకారం దత్తత తీసుకోండి..
అక్రమంగా దత్తత తీసుకోవడం చట్ట ప్రకారం నేరం. ‘కారా’ నిబంధనల ప్రకారం పిల్లలను దత్తత తీసుకోవడానికి అప్లయ్ చేసుకోవాలి. చిన్నారులతో పనులు చేయించడం, కొట్టడం నేరం. అలాంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. పులిగుజ్జు సైదులు, డీసీపీవో, యాదాద్రి