దేశంలో కొత్తగా 341 కరోనా కేసులు .. ముగ్గురు మృతి

 దేశంలో కొత్తగా 341 కరోనా కేసులు .. ముగ్గురు మృతి

దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.  కొన్నాళ్ల కిందట కనుమరుగైన ఈ వైరస్ భయం జనాలకు మళ్లీ పట్టుకుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో  341 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.  ఇందులో  292 కేరళలోనే రావడం గమనార్హం. ఇక తమిళనాడులో 13, మహారాష్ట్రలో 11, కర్ణాటకలో 9, తెలంగాణ, పుదుచ్చేరిలలో  4, ఢిల్లీ, గుజరాత్ లలొ  3, పంజాబ్, గోవాలలో ఒక్కో కేసు నమోదైంది.  ఇక కేరళలో కరోనా బారిన పడి ముగ్గురు చనిపోయారు.  ప్రస్తుతం దేశంలో 2 వేల 311 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.   వీటిలో ఒక్క కేరళలోనే 2041 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 

దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం అలెర్ట్ అయింది. కరోనా మహ మ్మారి కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఆరోగ్యశాఖ  ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించింది.   కేరళలో వెలుగు చూసిన కొవిడ్-19 ఉపరకం జేఎన్‌-1  పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం  సూచించింది. అయితే ఈ వేరియంట్‌ గురించి భయపడాల్సిన అవసరం లేదని తాజాగా WHO వెల్లడించింది. జేఎన్‌-1 అనేది ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపించదని ప్రకటించింది.  ప్రజలు మాత్రం మాస్క్ లు ధరించాలని, ఆరోగ్యకరమైన ఆహారం తినాలని వైద్యులు సూచిస్తున్నారు.