మంచిర్యాల జిల్లాలో రూ.342 కోట్ల ధాన్యం కొనుగోళ్లు

మంచిర్యాల జిల్లాలో రూ.342 కోట్ల ధాన్యం కొనుగోళ్లు
  • 286 సెంటర్ల ద్వారా 1.55 లక్షల టన్నులు సేకరణ 
  • రైతుల అకౌంట్లలో రూ.254.53 కోట్లు జమ 
  • ట్యాబ్​ ఎంట్రీ పూర్తి కాగానే మిగతా మొత్తం చెల్లింపు 

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో యాసంగి సీజన్​ధాన్యం కొనుగోళ్లు దాదాపు పూర్తయ్యాయి. ఇప్పటివరకు రైతుల దగ్గర నుంచి రూ.342.19 కోట్ల విలువైన 1.55 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లను కొనుగోలు చేశారు. ఈ ఏడాది 1.76 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం టార్గెట్​గా పెట్టుకుంది. ఇందుకోసం డీఆర్డీఏ ఐకేపీ ఆధ్వర్యంలో 136, పీఏసీఎస్​ 89, మెప్మా 10, డీసీఎంఎస్ ద్వారా 51, మొత్తం 286 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 285 సెంటర్లు క్లోజ్​ కాగా, ఒక్క వేమనపల్లి మండలం నీల్వాయి సెంటర్ మాత్రమే ఓపెన్​ ఉంది. ఇక్కడ ఉన్న 8 లారీల వడ్లను ట్రాన్స్​పోర్ట్​ చేసిన తర్వాత సెంటర్​ను మూసివేయనున్నారు.

రైతుల ఖాతాల్లో రూ.254 కోట్లు

జిల్లావ్యాప్తంగా 24,482 మంది రైతుల నుంచి రూ.342.19 కోట్ల విలువైన వడ్లు సేకరించగా, ఇప్పటివరకు 19,557 మంది రైతుల బ్యాంక్​ అకౌంట్లలో రూ.254.53 జమ చేశారు. 23,316 మంది రైతులకు సంబంధించి రూ.279.70 కోట్లను ట్యాబ్ ​ఎంట్రీ చేశారు. ఇంకా 1,166 మంది రైతులకు సంబంధించిన రూ.62.50 కోట్లు ట్యాబ్​ ఎంట్రీ పెండింగ్​ ఉంది. ఈ ప్రక్రియ పూర్తయిన వాటిలో 4,925 మంది రైతులకు రూ.25.17 కోట్లు చెల్లించాల్సి ఉంది. 
 

నిరుటికంటే తక్కువే..
 

ఈ ఏడాది యాసంగి సీజన్​లో నిరుటి కంటే తక్కువే కొనుగోళ్లు చేశారు. కిందటేడాది ఏప్రిల్​19న సెంటర్లను ఓపెన్​ చేయగా, ఈసారి ఏప్రిల్​1 నుంచే ప్రారంభించారు. 2022–23 సీజన్​లో 1.86 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లను సేకరించగా, ఈసారి 1.55 లక్షల మెట్రిక్​ టన్నులు కోనుగోళ్లు చేశారు. 2017–18లో 1.38 లక్షలు, 2018–19లో 1.56 లక్షలు, 201–20లో1.99 లక్షలు, 2020–21 సీజన్​లో రికార్డు స్థాయిలో 2.23 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం సేకరించారు. 2021–22లో అతి తక్కువగా 1.13 లక్షల మెట్రిక్​ టన్నులు మాత్రమే కొనుగోళ్లు జరిపారు.  

11 క్వింటాళ్లు కట్​ చేసిన్రు

కొనుగోలు కేంద్రాల్లో రైతుల ధాన్యం తరుగు తీయకుండా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)​ సబావత్​మోతీలాల్​తో పాటు సివిల్​ సప్లయీస్ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. అయితే రైస్​మిల్లుల్లో మాత్రం తరుగు పేరిట రైతులను దోచుకుంటున్నారు. వేమనపల్లి మండలం గొర్లపల్లి ఐకేపీ సెంటర్​లో పురాణం లక్ష్మీకాంత్​అనే రైతు 98.80 క్వింటాళ్ల వడ్లను తూకం వేశాడు. వాటిని పెద్దపల్లి జిల్లా కన్నాలలోని గణపతి ఇండస్ట్రీస్​కు పంపగా అక్కడ ఏకంగా 11 క్వింటాళ్లు కట్​చేశారని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. సోమవారం సివిల్​సప్లయీస్ ​కార్పొరేషన్​ డీఎం గోపాల్​ను కలిసి ఫిర్యాదు చేశాడు.

ఈ సీజన్లో కొనుగోళ్ల వివరాలు
ఏజెన్సీ                 సెంటర్లు             కొనుగోళ్లు
ఐకేపీ    136    83,481
పీఏసీఎస్    89    36,436
మెప్మా    10    5,443
డీసీఎంఎస్    51    29,842
మొత్తం    286    1,55,330