కొన్నాళ్లుగా ఎంతో ప్రశాంతంగా.. హాయిగా అర్థరాత్రులు హ్యాపీగా తిరిగిన మందు ప్రియులకు షాక్.. 2024, జూన్ 16వ తేదీ రాత్రి పోలీసులు హడలెత్తించారు. ఎన్నికల ముందు నుంచి సిటీలో దాదాపు డ్రంక్ అండ్ డ్రైవ్ తగ్గిపోయింది. ఎన్నికల ముందు వరకు గల్లీ గల్లీలో దర్శనం ఇచ్చిన డ్రంక్ అండ్ డ్రైవ్ లు.. ఎన్నికల సమయంలో 80 శాతం తగ్గాయి. దీంతో మందు ప్రియులు రిలాక్స్ అయ్యారు.
హ్యాపీగా మందు కొట్టి.. జాలీగా డ్రైవ్ చేసుకుంటూ ఇళ్లకు వెళ్లిపోయారు. అందరూ రిలాక్స్ మూడ్ లోకి వెళ్లిన సమయంలో.. ఆదివారం రాత్రి ఒక్కసారిగా హైదరాబాద్ సిటీ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులతో విరుచుకుపడ్డారు. దీంతో వందల మంది మందు ప్రియులు అడ్డంగా దొరికిపోయారు.
హైదరాబాద్ సిటీలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై పోలీసులు గట్టి ఫోకస్ పెట్టారు. 2024, జూన్ 16వ తేదీ ఆదివారం రాత్రి చేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో వందల మంది మందు ప్రియులు పట్టుబడ్డారు. మందుకొట్టి వాహనాలు నడుపుతున్నవారికి బ్రీత్ ఎనలైజర్ టెస్టు చేశారు. పోలీసుల తనిఖీల్లో 349 మంది పట్టుబడ్డారు. ఈ తనిఖీల్లో ఓ వ్యక్తికి 544 పాయింట్లు, మరో వ్యక్తికి 484 పాయింట్లు రావడం సంచలనంగా మారింది. ఇంత మందు కొట్టి నడవటమే కష్టం అయితే.. వాళ్లు మాత్రం ఏకంగా కార్లు నడుపుకుంటూ రోడ్డపైకి రావటం పోలీసులనే షాక్ కు గురి చేసింది.
ఆదివారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో 253 బైక్స్, 16 ఆటోలు, 74 కార్లు , ఆరు భారీ వాహనాలు పట్టుబడ్డాయి. తనిఖీల్లో భాగంగా పోలీసులతో చాలా చోట్ల వాహనదారులు వాగ్వాదానికి దిగారు.