- భారీ మెజార్టీనే టార్గెటంటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్
- కేసీఆర్రోడ్ షో సక్సెస్‌తో కారు పార్టీ లీడర్లుఖుషీ
- మెజార్టీలో రికార్డులు బ్రేక్ చేస్తామంటున్న కాంగ్రెస్ నేతలు
ఖమ్మం, వెలుగు: ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీలో ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరి అవకాశాలను దెబ్బతీస్తారన్న చర్చ మొదలైంది. ఈ సారి మొత్తం35 మంది బరిలో నిలిచారు. ఇందులో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థులను మినహాయిస్తే మిగిలిన వాళ్లంతా చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులే. 2014 ఎన్నికల్లో 20 మంది ఇండిపెండెంట్లు పోటీ చేయగా, 2019 ఎన్నికల్లో 13 మంది పోటీలో నిలిచారు. ఈసారి అంతకుమించి 24 మంది ఇండిపెండెంట్లే పోటీ చేస్తుండడం ఎవరికి ఇబ్బందికరంగా మారుతుందోనన్న చర్చ జరుగుతోంది.
2014లో ఇండిపెండెంట్లు 55,450 ఓట్లు సాధించగా, ఆ ఎన్నికల్లో వైసీపీ తరఫున పొంగులేటి శ్రీనివాస రెడ్డి 12,204 ఓట్లతో గెలిచారు. 2019లో 51,842 ఓట్లను ఇండిపెండెంట్లు సాధించగా ఆ ఎలక్షన్లలో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు 1,68,062 ఓట్లతో గెలుపొందారు. ఈసారి బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ నడుస్తుండగా, బీజేపీ కూడా పోటీ పడుతోంది. తమ విజయంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ టూర్ తో బీఆర్ఎస్లో జోష్..
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఖమ్మం సీటు గెలవబోతున్నామని చెప్పడంతో ఆ పార్టీ నేతలు మస్తు ఖుషీగా ఉన్నారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో రెండ్రోజుల పాటు కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు అంచనాలకు మించి జనం రావడంతో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు సహా పార్టీ ముఖ్య నేతలు జోష్ లో ఉన్నారు. అంతర్గత సమావేశంలో కూడా కేసీఆర్ పాజిటివ్‌గానే మాట్లాడడం, రాష్ట్రంలో గెలిచే స్థానాల్లో ఖమ్మం కూడా ఉందని చెప్పడంతో మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నారు.
ఖమ్మంలో నామా గెలిస్తే కేంద్ర మంత్రి అయ్యే అవకాశముందని కేసీఆర్ చెప్పడం కచ్చితంగా ఓటర్లను ప్రభావితం చేస్తుందని, తమకు మరింత మెజార్టీ తెస్తుందని బీఆర్ఎస్ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లో ఇప్పటి వరకు అత్యధిక మెజార్టీ రికార్డు నామా నాగేశ్వరరావు పేరు మీదే ఉంది. గత ఎన్నికల్లో ఆయన 1,68,062 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి రేణుకాచౌదరిపై విజయం సాధించారు. ఈసారి కూడా అంత మెజార్టీ వస్తుందని నామా ధీమాగా ఉన్నారు.
రికార్డు బ్రేక్ చేసే ప్లాన్‌లో కాంగ్రెస్..
ఖమ్మంలో తమ పార్టీ గెలుపు ఖాయమన్న ధీమాతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోనే ఖమ్మం అంటేనే కాంగ్రెస్ జిల్లా అని నిరూపించామని చెబుతున్నారు. ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో ఇంతకు ముందున్న మెజార్టీ రికార్డులను తాము ఈ సారి బ్రేక్ చేయడం పక్కా అని స్పష్టం చేస్తున్నారు. త్వరలోనే ఉమ్మడి జిల్లాలో పార్టీలోకి మరిన్ని చేరికలు ఉంటాయని, ఈనెల 4న కొత్తగూడెంలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ సందర్భంగా కూడా కొందరు ముఖ్య నేతలు కాంగ్రెస్ లో చేరుతారని చెబుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లను బట్టి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ 2లక్షల 63 వేల ఆధిక్యం ఉందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.