డాంగ్: తీర్థయాత్రలు చేస్తున్న భక్తుల బస్సు అదుపు తప్పి లోయలో పడింది.. దీంతో ఐదుగురు భక్తులు చనిపోయారు. మరో 35 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గుజరాత్‌లోని డాంగ్ జిల్లాలో సాపుతారా హిల్స్ వద్ద ఆదివారం తెల్లవారుజామున 4.15 గంటలకు ఈ ఘోరం చోటుచేసుకుంది. వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌ను ఢీకొని 35 అడుగుల లోయలో పడిపోయింది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు.
గాయపడిన వారిలో 17 మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 48 మంది ఉన్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన యాత్రికులు గత రెండు నెలలుగా తీర్థయాత్ర చేస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. నిరుడు డిసెంబరు 23న నాలుగు బస్సుల్లో తమ యాత్రను ప్రారంభించారు.
ఈ క్రమంలో మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ నుంచి గుజరాత్‌లోని ద్వారకాకు వెళుతున్నారు. మార్గం మధ్యలో సాపుతారా వద్ద టీ తాగారు. మళ్లీ తమ జర్నీ ప్రారంభించారు. కొద్ది సేపటికే సాపుతారా హిల్ స్టేషన్‌కు 2.5 కిలోమీటర్ల దూరంలో బృందంలోని ఒక బస్సు అదుపు తప్పింది. రెయిలింగ్‌ను ఢీకొని 35 అడుగుల లోయలో పడిపోయింది.
ఐదుగురు స్పాట్లోనే చనిపోయారు. ప్రమాదం జరిగిన కాసేపటికి స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సాయంతో పోలీసులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. బాధితులను ముందుగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు తరలించారు. తీవ్రంగా గాయపడిన 17 మందిని డాంగ్ జిల్లాలోని ఆహ్వాలోని సివిల్ హాస్పిటల్ కు తరలించారు.