- గత పాలకుల అండదండలతో రెచ్చిపోయిన మైనింగ్ మాఫియా
- లీజును మించిన తవ్వకాలు.. కెపాసిటీని మించి రవాణా
- టాస్క్‌ఫోర్స్ ఎంక్వైరీలో బయటపడ్తున్న అక్రమాలు
- గడిచిన పదేండ్లలో ఖజానాకు భారీగా గండి
- రంగంలోకి రాష్ట్ర సర్కారు.. క్వారీల వద్ద సీసీ కెమెరాలతో నిఘా
- లీజ్ నిబంధనలు ఉల్లంఘించిన 261 క్వారీల ఐడీలు బ్లాక్
హైదరాబాద్, వెలుగు : గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేండ్ల కాలంలో రాష్ట్రంలో మైనింగ్ మాఫియా రెచ్చిపోయింది. నాటి పాలకుల అండదండలతో అడ్డగోలుగా, అక్రమంగా గ్రానైట్, ఇసుక క్వారీల తవ్వకాలు చేపట్టి, రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల రూపాయలు గండి కొట్టింది. పదేండ్లలో ఒకటి కాదు.. రెండు కాదు దాదాపు రూ.35 వేల కోట్ల ఆదాయాన్ని మైనింగ్ మాఫియా మింగేసినట్టు తెలిసింది. కొన్నిచోట్ల అనుమతులను మించి తవ్వకాలు చేయగా.. ఇంకొన్నిచోట్ల అసలు అనుమతులు లేకున్నా, గడువు తీరిన తర్వాత కూడా యథేచ్చగా గ్రానైట్, ఇసుక తవ్వకాలు జరిపినట్టు తేలింది.
ఆయా జిల్లాల్లో అప్పటి అధికార పార్టీ లీడర్లు, కొందరు అధికారులు, పోలీసులు కుమ్మక్కై వ్యవహారం నడిపినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించింది. భారీగా గ్రానైట్, ఇసుక తవ్వకాలు జరుగుతున్నా రాష్ట్ర ఖజానాకు ఆశించినస్థాయిలో రాబడి రాకపోవడంతో ప్రభుత్వం ఇంటర్నల్ ఎంక్వైరీకి ఆదేశించింది. ఇంటెలిజెన్స్‌తోపాటు టాస్క్‌ఫోర్స్ టీమ్స్‌తో రాష్ట్రంలో జరుగుతున్న మైనింగ్ మాఫియా వివరాలు సేకరించినట్టు తెలిసింది. దీంట్లో విస్తుగొల్పే విషయాలు బయటకు వచ్చాయి. గత ప్రభుత్వంలో ఉన్న జిల్లాల మంత్రులకు, ఇన్చార్జి మంత్రులకు, స్థానిక ఎమ్మెల్యేలకు
అధికార పార్టీ బడా లీడర్లకు ప్రతినెలా మామూళ్లు ,షేర్లు పంచుతూ రాష్ట్ర రాబడికి పెద్ద ఎత్తున గండికొట్టినట్టు గుర్తించారు. క్వారీల్లో ఏ పరిమాణంలో తవ్వకాలు చేపట్టారనే వివరాలను డీజీపీఎస్ సాంకేతికతతో శాటిలైట్ ద్వారా లెక్కిస్తారు. అయితే, ఈ లెక్కింపు బాధ్యతలను అప్పటి ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించింది. దీంతో క్వారీ యజమానులతో కుమ్మక్కయిన ఏజెన్సీ నిర్వాహకులు కోట్లాది రూపాయల మామూళ్లు తీసుకుంటూ ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏటా యావరేజ్ గా రూ.3,500 కోట్ల చొప్పున కొల్లగొట్టారు. ఇదంతా ప్రిలిమినరీ అంచనాలేనని, వాస్తవంగా జరిగిన మొత్తం ఇంతకు డబుల్ ఉంటుందని అంటున్నారు.
ప్రతి ఏడాది ఇసుక, గ్రానైట్,ఇతర మైనింగ్‌తో రాష్ట్రానికి రూ.6 వేల కోట్ల నుంచి 7 వేల కోట్ల మేర రాబడి అంచనా వేస్తున్నారు. ఇంతకు మించి రావాల్సి ఉండడం... ఆదాయానికి గండి పడుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. మైనింగ్ మాఫియాను అడ్డుకునేందుకు చర్యలు ప్రారంభించింది. గత నెలలో రాష్ట్ర మైనింగ్ శాఖ డైరెక్టర్ సురేంద్ర మోహన్ ఆదేశాల మేరకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు అన్ని క్వారీల్లోనూ తనిఖీలు నిర్వహించాయి.
ఈ తనిఖీల్లో లీజ్ నిబంధనలను ఉల్లంఘించి భారీగా మైనింగ్ చేయడం, లీజ్ గడువు తీరడంలాంటి అంశాలను గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 261 క్వారీల ఐడీలను బ్లాక్ చేశారు. అక్కడ ఎలాంటి మైనింగ్ యాక్టివిటీ జరగకుండా పర్యవేక్షించేందుకు ఎంట్రీ, ఎగ్జిట్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను తాజాగా మైనింగ్ శాఖ డైరెక్టర్ ఆదేశించారు.
ఆదాయం మాటున అక్రమాలు !
ఇసుక క్వారీలు, సప్లైలో తీసుకున్న చర్యలతో ఆదాయం పెంచామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించుకున్నది. అయితే, ఇదే ఆదాయం మాటున భారీగా అక్రమాలు కూడా జరిగినట్టు తెలుస్తున్నది. 2014–15లో ఇసుక ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.19.12 కోట్లు గా ఉన్నది. ప్రస్తుతం రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు సగటున ఏటా రూ.650 కోట్ల మేర ఇసుక విక్రయాల ద్వారా ఆదాయం సమకూరింది. సుమారు కోటిన్నర క్యూబిక్ మీటర్లకుపైగా ఇసుకను వెలికితీసి ఆన్‌లైన్ విధానంలో విక్రయిస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో 19 ఇసుక రీచ్‌లు నిర్వహిస్తున్నారు. పదేండ్లలో భారీ ఎత్తు న ఆదాయం పెరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ.. దీనివెనక అనేక అక్రమాలు చోటుచేసుకున్నట్టు గుర్తించారు.
దీనికంటే డబుల్ ఆదాయం ఇసుక మాఫి యా చేతుల్లోకి వెళ్లినట్టు తెలిసింది. క్వారీల్లో అనుమతించిన క్యూబిక్ మీటర్ల కంటే ఎక్కువ మొత్తంలో ఇసుక తవ్వకాలు చేపట్టి సంపదను కొల్లగొట్టారు. ప్రభుత్వానికి ఆదాయం రాకుండా ఉండేందుకు రికార్డుల్లో ఎక్కడా లెక్కలు నమోదు కాకుండా అక్రమ ఇసుక రవాణా చేసి, కోట్ల రూపాయలు జేబుల్లో వేసుకున్నారు. సిరిసిల్లలో ఇసుక రవాణాను అడ్డుకునేందుకు వెళ్లిన నేరేళ్ల యువకులను అరెస్ట్ చేసి కొట్టిన దాంట్లోనూ మైనింగ్ మాఫియానే కారణంగా పేర్కొంటున్నారు.
ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏడాది కాలంలోనే ఇసుకతో రూ.750 కోట్ల మేర ఆదాయం వచ్చింది. అంటే దాదాపు వంద కోట్లు పెరిగింది. మూడు నెలల కిందటి నుంచే ప్రభుత్వం ఖజానా లీకులను అరికట్టడం మొదలుపెట్టింది. మరింత నిఘా పెంచి.. అప్రమత్తంగా ఉంటే ఇసుక ఆదాయం మరింత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగానే ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వే బిల్లులు పక్కాగా చూడటంతోపాటు ఇసుక రీచ్ లపైనా నిఘా పెంచింది.
గ్రానైట్‌లోనూ అదే వ్యవహారం
రాష్ట్రంలో మొత్తం 2,154 మైనింగ్ క్వారీలను ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. ఇందులో ఎక్కువగా గ్రానైట్, క్రషింగ్ యూనిట్స్ ఉన్నాయి. కరీంనగర్, రంగారెడ్డి, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్ రూరల్, మహబూబాబాద్, ఖమ్మం, కామారెడ్డి, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ ఇతర జిల్లాల్లో గ్రానైట్‌తోపాటు ఇతర మైనింగ్‌లకు అనుమతులు ఉన్నాయి. గత పదేండ్లలో లీజుదారులు ఒకచోట అనుమతి తీసుకుని మరోచోట తవ్వకాలు సాగించి, అక్రమాలకు పాల్పడినట్టు తేలింది. ఇందులో గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్లు, వారి బంధువులు ఉన్నట్టు తెలిసింది. అనుమతి పొందిన ప్రాంతం హద్దులు దాటి ఎక్కువ మొత్తంలో తవ్వకాలు జరపడంతో ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీలో భారీగా కోతపడింది.
చాలా క్వారీల్లో యజమానులు తాము అనుమతి తీసుకున్న విస్తీర్ణానికి మించి ఇష్టారాజ్యంగా గుట్టలను తొలిచేస్తున్నారు. పర్మిషన్ ఒక సర్వే నంబర్లో తీసుకుని, మరోచోట మైనింగ్ చేస్తున్నారు. పర్మిషన్ తీసుకున్న పరిమాణం కంటే వందల రెట్లు అధికంగా తరలిస్తున్నారు. ఈ దందాను ఎక్కడికక్కడ అరికట్టాల్సిన జిల్లా మైనింగ్ డిపార్ట్మెంట్ ఏడీలు, జిల్లా సర్వేయర్లు, రాయల్టీ ఇన్ స్పెక్టర్లు పట్టించుకోవడం లేదు. అప్పడప్పుడు డ్యూటీ చేసినట్లుగా నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారు. కనీసం లీజ్ పీరియడ్ ముగిసిన క్వారీలను కూడా క్లోజ్ చేయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. రాష్ట్రంలో గతంలో దొంగ లెక్కలతో, తప్పుడు పత్రాలతో మైనింగ్ ఎగుమతి చేసి కోట్లు కొల్లగొట్టినట్టు ఈడీ దృష్టికి రావడం కొన్ని కంపెనీలకు నోటీసులు కూడా జారీ అయ్యాయి.
నలుగురిపై కేసు..6 కోట్ల ఫైన్
కరీంనగర్, వెలుగు : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ ఏడాది ఫిబ్రవరిలో మైనింగ్ ఆఫీసర్లు చేపట్టిన తనిఖీల్లో.. లీజ్ నిబంధనలను ఉల్లంఘించి, అనుమతికి మించి హద్దులు దాటి నలుగురు గ్రానైట్ వ్యాపారులు తవ్వకాలు చేపట్టినట్టు పోలీసులు గుర్తించారు. వారిపై కేసులు నమోదు చేశారు. వీరికి రూ.6.11 కోట్ల ఫైన్ వేశారు. ఓవర్ లోడ్ వాహనాలకు సంబంధించి రూ.5.12 లక్షల జరిమానా విధించారు. ఈ జిల్లాలో క్వారీలపై చాలా ఏళ్లుగా వందల కోట్ల పన్ను ఎగవేత ఆరోపణలు ఉన్నాయి.
కరీంనగర్ జిల్లాలోని పలు క్వారీల్లో గ్రానైట్ తరలింపులో పెద్దఎత్తున అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి పెద్దఎత్తున సీనరేజ్ చార్జీలను చెల్లించలేదు. దీంతో మీపై శాఖాపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదని గతంలో ఈ జిల్లాలో పనిచేసిన అధికారులకు అక్టోబర్ లో ఉన్నతాధికారులు నోటీసులు జారీచేశారు.