బాల్కొండ, వెలుగు: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి శనివారం 35 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఉదయం 27850 క్యూసెక్కులు, తర్వాత 30 వేల క్యూసెక్కులు, మధ్యాహ్నానికి 35000 క్యూసెక్కులకు పెరిగింది. గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో సాయంత్రానికి ఇన్ ఫ్లో 30 వేలకుతగ్గిపోయింది.
ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు పెరగడంతో నీటిమట్టం ఆశాజనకంగా మారుతుందనుకున్న తరుణంలో ఇన్ ఫ్లో తగ్గింది. ఈ ఖరీఫ్ సీజన్ లో ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద 25 టీఎంసీలకు మించలేదు. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం నిరాశ జనకంగా మారుతుంది. ఖరీఫ్ లో గరిష్టంగా 35078 క్యూసెక్కుల వరద వచ్చింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు(80.50టీఎంసీలు) కాగా శనివారం సాయంత్రానికి ప్రాజెక్టులో1074.20 అడుగులు(31.25 టీఎంసీలు)నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు.గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 1087.00 అడుగులు(66.50 టీఎంసీలు) నీరు ఉంది.