- కోఆర్డినేటర్లు, మానిటరింగ్ ఆఫీసర్ల నియామకం
- అప్లికేషన్ఫామ్స్ చాలక నెమ్మదిగా సాగిన సర్వే
- సరిపడా అప్లికేషన్ ఫామ్స్ఇవ్వాలని ఎన్యుమరేటర్ల రిక్వెస్ట్
- మంత్రి పొన్నం ప్రభాకర్ఇంటికి వెళ్లి వివరాలు సేకరించిన అధికారులు
హైదరాబాద్ సిటీ, వెలుగు : గ్రేటర్ పరిధిలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కొనసాగుతోంది. ఈ నెల 6 నుంచి 8 వరకు ఇంటింటికి తిరిగి స్టిక్కర్లు అంటించిన ఎన్యుమరేటర్లు, శనివారం నుంచి ఫిజికల్ సర్వేను షురూ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 28లక్షల30వేల390 ఇండ్లు ఉండగా, మూడు రోజుల్లో 80 శాతం ఇండ్లకు స్టిక్కర్లు అంటించారు. అయితే శనివారం ఎన్యుమరేటర్లకు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్స్సరిపోలేదు. దీంతో ఆశించిన మేర సర్వే సాగలేదు.
రోజుకు ఒక్కో ఎన్యుమరేటర్ కనీసం 10 ఇండ్లు సర్వే చేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ అప్లికేషన్ ఫామ్స్ రాకపోవడంతో శనివారం 35 వేల ఇండ్ల సర్వే మాత్రమే పూర్తయింది. ఫామ్స్ కోసం ఎన్యుమరేటర్లను ఉదయం 5 గంటలకే ఆఫీసులకు పిలిచినప్పటికీ సరిపడా ఫామ్స్ ఇవ్వలేదు. కొన్నిచోట్ల ఒక్కో ఎన్యుమరేటర్ కు ఒక ఫామ్ మాత్రమే ఇచ్చారు. దీంతో ఎన్యుమరేటర్లు మిగిలిన 20 శాతం ఇండ్లకు స్టిక్కర్లు అంటించారు. మొత్తం 18,419 మంది ఎన్యుమరేటర్లు, 1,745 సూపర్ వైజర్లు సర్వేలో పాల్గొంటున్నారు. సరిపడా ఫామ్స్ఇస్తే సర్వే వేగంగా సాగుతుందని చెబుతున్నారు.
మానిటరింగ్ఆఫీసర్ల టీమ్
జీహెచ్ఎంసీ పరిధిలో సమగ్ర కుటుంబ సర్వే సజావుగా సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేటింగ్ ఆఫీసర్ తో పాటు ముగ్గురు మానిటరింగ్ ఆఫీసర్లను నియమించింది. గ్రేటర్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ గా హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ను, సికింద్రాబాద్, చార్మినార్ జోన్లకు మానిటరింగ్ అధికారిగా హెచ్‌ఎండీఏ జాయింట్ కమిషనర్ శ్రీవాత్స కోట, ఎల్బీనగర్ , ఖైరతాబాద్ జోన్లకు ఏఎంయూడీ డిప్యూటీ సెక్రెటరీ ప్రియాంక, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి జోన్లకు వాటర్ బోర్డు ఈడీ మయాంక్ మిట్టల్‌ను నియమించింది.
ఎలాంటి మెసేజ్‌లు రావు..
ప్రభుత్వం చేపట్టిన సర్వే పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సర్వే పేరుతో ఓటీపీ వస్తుందని లేదా సర్వే అధికారులమని ఇంటికొచ్చి మోసాలకు పాల్పడే అవకాశముందని చెబుతున్నారు. సర్వేకు సంబంధించి ఎలాంటి మెసేజ్ లు రావని, ఓటీపీలు ఎవరూ అడగరని తెలిపారు. ఇలా ఎవరైనా అడిగితే వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
ఎన్యుమరేటర్లకు సహకరించాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
సర్వే కోసం వచ్చే ఎన్యుమరేటర్లకు ప్రజలు పూర్తిగా సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. బంజరాహిల్స్ రోడ్ నంబర్13, మినిస్టర్స్ కాలనీలోని మంత్రి ఇంటికి శనివారం ఎన్యుమరేటర్లు వెళ్లారు. మంత్రి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి స్టిక్కర్ అతికించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు అలాగే ఇతర బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలను మెరుగు పరిచేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఎన్యుమరేటర్ల సర్వే తీరును జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, జీహెచ్ఎంసీ అడిషనల్కమిషనర్ స్నేహ శబరీష్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరామ్, డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి, తహసీల్దార్ అనితారెడ్డి, సూపర్ వైజర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.