అన్నను చంపిన తమ్ముడు.. జగిత్యాల జిల్లా వెల్గటూరులో ఘటన

అన్నను చంపిన తమ్ముడు.. జగిత్యాల జిల్లా వెల్గటూరులో ఘటన

జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కుమ్మరిపల్లిలో సోమవారం రాత్రి ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఆస్తి, కుటుంబ తగాదాలే దీనికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కుమ్మరిపల్లి గ్రామానికి చెందిన బొమ్మల శంకర్, భారతికి ఇద్దరు కొడుకులు.పెద్ద కొడుకు సుమన్, అతని భార్య మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఆమె వేరుగా ఉంటున్నది. సుమన్ ఏమో అతని తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు.

సుమన్, అతని తమ్ముడు డిల్లేశ్​కు కొన్ని రోజులుగా కుటుంబ, ఆస్తి విషయంలో గొడవలు నడుస్తున్నాయి. కొన్ని రోజుల కింద డిల్లేశ్​పై సుమన్ మద్యం మత్తులో దాడి చేశాడు. దీంతో అన్నపై డిల్లేశ్ పగ పెంచుకున్నాడు. సోమవారం రాత్రి కిరాణా షాప్​కు వెళ్లిన సుమన్​పై పదునైన ఆయుధంతో డిల్లేశ్ దాడి చేసి చంపేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

కిరాణ షాప్​కు వెళ్లిన కొడుకు ఎంత సేపటికీ రాకపోవడంతో అతని తల్లి భారతి వెతుక్కుంటూ వెళ్లింది. అయితే, అప్పటికే రోడ్డుపై సుమన్ రక్తపుమడుగులో పడి ఉన్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ రామ్ నర్సింహారెడ్డి, ఎస్ఐ ఉమాసాగర్ ఘటనా స్థలానికి చేరుకుని డాగ్​స్క్వాడ్, క్లూస్ టీమ్​తో ఎంక్వైరీ చేశారు. అనుమానితుడైన డిల్లేశ్​తో పాటు గ్రామానికి చెందిన మరొకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.