గణేష్ నిమజ్జనం.. కుర్రోళ్లకు కిక్కే కిక్కు.. డాన్సులతో, రంగులతో అంతా హడావిడి సందడి నెలకొంటుంది. మారిన కాలం.. మారిన ఆహారపు అలవాట్లతో యువకులు సైతం గుండెపోటుతో చనిపోతున్నారు. మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ లో గణేష్ మండపం దగ్గర డాన్స్ చేస్తూ.. యువకుడు కుప్పకూలి చనిపోయిన ఘటన మరవక ముందే.. అలాంటి సంఘటనే ఇప్పుడు తెలంగాణలో 2033, సెప్టెంబర్ 27వ తేదీన జరిగింది.
తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా రమారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామంలో గణేష్ నిమజ్జనాన్ని పురస్కరించుకుని.. 35 ఏళ్ల నరేష్ అనే వ్యక్తి డాన్స్ చేస్తున్నాడు. పెద్దగా డీజే కూడా ఉంది. ఈ డీజే పాటలకు డాన్స్ చేస్తుండగా గుండెపోటుతో చనిపోయాడు. కుప్పకూలిన నరేష్ ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే కార్డియాక్ అరెస్టుతో చనిపోయినట్లు తెలిపారు డాక్టర్లు.
డీజే సౌండ్ వల్లే నరేష్ చనిపోయాడని.. అప్పటి వరకు బాగానే ఉన్నాడని.. డీజే సౌండ్ ఆన్ చేసి పాటలకు డాన్స్ చేయటం మొదలుపెట్టిన వెంటనే కింద పడిపోయాడని చెబుతున్నారు. డీజే సౌండ్ వల్లే గుండెపోటు వచ్చిందని చెబుతున్నారు స్నేహితులు. నరేష్ మృతదేహాన్ని కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం తర్వాత విషయాలు వెలుగులోకి రానున్నాయి.