గ్రేటర్‌లోని 3 కమిషనరేట్లలో లాక్ డౌన్‌కు పటిష్ఠ బందోబస్తు
సెక్యూరిటీపై సీపీల మానిటరింగ్
10 గంటల తర్వాత ఖాళీగా రోడ్లు
రూల్స్ బ్రేక్ చేసిన వారిపై కేసులు
హైదరాబాద్,వెలుగు: ప్రభుత్వం 10 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించడంతో మొదటిరోజైన బుధవారం గ్రేటర్లో పోలీసులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. 3 కమిషనరేట్ల సీపీలు మానిటరింగ్ చేశారు. ఉదయం 9.30 గంటల నుంచే సిటీ రోడ్లపై సెక్యూరిటీ ఏర్పాట్లు పర్యవేక్షించారు. అనుమతులు లేని వ్యాపార సంస్థలను 10 గంటల లోపు క్లోజ్ చేయించారు. ప్రతి పీఎస్ లిమిట్స్‌లో ప్యాట్రో కార్,బ్లూ కోల్ట్ సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహించారు. పబ్లిక్ ఎక్కువగా ఉన్న ఏరియాల్లో ఫిజికల్ డిస్టెన్స్,మాస్క్ వయోలేషన్‌పై ఫోకస్ పెట్టారు. హైదరాబాద్,సైబరాబాద్,రాచకొండ కమిషనరేట్ల లిమిట్స్‌లో మొత్తం 350 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. రోడ్లపై బారికేడ్లు పెట్టారు. ప్రతి చెక్‌పోస్ట్ వద్ద ఎస్ఐ స్థాయి అధికారి, లా అండ్ ఆర్డర్,ట్రాఫిక్ సిబ్బందిని నియమించారు. ఉదయం 10 గంటల తరువాత రోడ్లపైకి వచ్చిన వాహనదారులను చెక్ చేశారు. ఎమర్జెన్సీ సర్వీసెస్, ప్రభుత్వ ఉద్యోగుల ఐడీ కార్డులను చెక్ చేసి ట్రావెలింగ్‌కి అనుమతినిచ్చారు. అత్యవసర పరిస్థితిలో ట్రావెల్ చేస్తున్న వారికి ఈ– పాస్ ఉంటేనే పర్మిషన్ ఇచ్చారు.
సీసీ కెమెరాలతో అబ్జర్వేషన్
3 కమిషరేట్ల సీపీలు లాక్‌డౌన్ సెక్యూరిటీని పరిశీలించారు. సిటీ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన 168 చెక్‌పోస్టుల వద్ద పరిస్థితిని సీపీ అంజనీకుమార్ ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. జాయింట్ సీపీలతో కలిసి చార్మినార్,రవీంద్రభారతి ఏరియాల్లో పర్యటించారు. బషీర్‌బాగ్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. నేషనల్,ఇంటర్నేషనల్ ట్రావెలర్స్‌కి 700 డిజిటల్ పాసెస్ ఇష్యూ చేశారు. ఈ –పాసెస్ చూపిన వారికి ట్రావెలింగ్ కు అనుమతినిచ్చారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు ఇండ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని సీపీ అంజనీకుమార్ సూచించారు.
రాచకొండ, సైబరాబాద్‌లో..
సైబరాబాద్,రాచకొండ లిమిట్స్‌లో 156కి పైగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. హైటెక్ సిటీ, జేఎన్టీయూ, ,కూకట్‌పల్లి, జీడిమెట్ల, షాపూర్ నగర్ లో సీపీ సజ్జనార్ పర్యటించారు. బయోడైవర్సిటీ,గచ్చిబౌలి ఫ్లై ఓవర్స్ ను పోలీసులు క్లోజ్ చేశారు. ఐటీ కారిడార్‌లోని అత్యవసర సంస్థలకు ఎమర్జెన్సీ పాసెస్ ఇష్యూ చేశారు. ఎయిర్ పోర్టుకు వెళ్లే ప్యాసింజర్లు ఫ్లైట్ టికెట్ తప్పనిసరిగా చూపించాలని శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి తెలిపారు. ఎయిర్ పోర్టులో పనిచేసే సిబ్బంది ఐడీ కార్డులను చూపించాలన్నారు. గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న రాచకొండ కమిషనరేట్ పరిధిలోని శివారు ప్రాంతాల్లో సీపీ మహేశ్‌భగవత్ పర్యటించారు. ఎల్బీనగర్,ఉప్పల్ పరిసర ప్రాంతాల్లోని చెక్‌పోస్టులను తనిఖీ చేశారు. రోడ్లపై ట్రావెల్ చేస్తున్న వాహనదారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనవసరంగా రోడ్లపై తిరిగే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నేషనల్ హైవేస్‌లో ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్‌ను అనుమతించాలని చెప్పారు.
సిటిజన్స్ సహకరించాలె
లాక్ డౌన్ కు సిటిజన్స్ సహకరించాలి. ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించాలి. అనవసరంగా రోడ్లపైకి వస్తే కేసులు రిజిస్టర్ చేస్తాం. వెహికల్స్ సీజ్ చేస్తాం. రంజాన్ ప్రార్థనలను ముస్లింలు ఇండ్లల్లోనే కొవిడ్ రూల్స్ పాటిస్తూ చేసుకోవాలి. ఎయిర్‌పోర్టుకు వెళ్లే ట్రావెలర్స్ కోసం డిజిటల్ పాసులను ఇస్తున్నాం. ట్రాన్స్ పోర్టుకు పర్మిషన్ ఉన్న వారు ఆ వెహికల్ మిర్రర్ పై సెల్ఫ్ డిక్లరేషన్ లెటర్‌ను అంటించుకోవాలి.
‑ అంజనీకుమార్, సిటీ సీపీ, హైదరాబాద్