నిజామాబాద్/ నందిపేట, వెలుగు : జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. శుక్రవారం నందిపేట, డొంకేశ్వర్ మండల కేంద్రాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. కేంద్రాల వద్ద రైతులు, అధికారులతో మాట్లాడి కొనుగోళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారుల పరస్పర సహకారంతో ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయన్నారు.
రైతులకు చెల్లింపులు కూడా జరుగుతున్నాయని, డిసెంబర్ మొదటివారంలో జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు పూర్తవుతాయన్నారు. గురువారం నుంచి రైతుల ఖాతాల్లో రూ.500 బోనస్ కూడా జమవుతున్నట్లు తెలిపారు. అనంతరం నందిపేట ఎండీడీఓ కార్యాలయంలో కుటుంబ సర్వే డాటా ఎంట్రీ తీరును పరిశీలించారు.
డొంకేశ్వర్‌లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని వీడీసీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట తహసీల్దార్ ఆనంద్‌కుమార్, ఎంపీడీఓ శ్రీనివాసరావ్, అయిలాపూర్ పీఏసీఎస్ చైర్మన్ మీసాల సుదర్శన్ ఉన్నారు.