అస్వస్థతకు కలుషిత ఆహారమే కారణం .. వార్డెన్​పై సస్పెన్షన్ వేటు

  • అచ్చంపేటలో 17 మంది విద్యార్థినులకు ట్రీట్​మెంట్
  • ఐదుగురిని జిల్లా హాస్పిటల్ కు రిఫర్  చేసిన డాక్టర్లు
  • వివరాలు సేకరించిన బాలల హక్కుల కమిషన్
  • హాస్టల్​ను తనిఖీ చేసిన ఫుడ్​ సేఫ్టీ ఆఫీసర్
  • వార్డెన్​పై సస్పెన్షన్  వేటు వేసిన కలెక్టర్​ 

అచ్చంపేట/నాగర్​కర్నూల్/అమ్రాబాద్, వెలుగు:  నాగర్​కర్నూల్​ జిల్లా మన్ననూర్  ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల అస్వస్థతకు కలుషిత ఆహారమే కారణమని డాక్టర్లు, అధికారులు స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం ఫుడ్​ పాయిజన్​తో అస్వస్థతకు గురైన 350 మంది విద్యార్థులను అచ్చంపేట హాస్పిటల్ కు  తరలించారు. ప్రభుత్వ వైద్యులు, డాక్టర్ వంశీకృష్ణతో పాటు పట్టణంలోని ప్రైవేట్​ హాస్పిటల్ వైద్యులు విద్యార్థులకు వైద్యం అందించడంతో వారు సేఫ్​గా బయటపడ్డారు. ప్రస్తుతం17 మంది అచ్చంపేట హాస్పిటల్ లో  చికిత్స పొందుతున్నారు. ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో నాగర్ కర్నూల్ కు తరలించారు. అచ్చంపేట, నాగర్​కర్నూల్​ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వారిని ప్రభుత్వ విప్ గువ్వల  బాల్ రాజు పరామర్శించారు.

 ఈ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అచ్చంపేటలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను డీసీసీ ప్రెసిడెంట్  డాక్టర్  వంశీకృష్ణ, బీజేపీ నేతలు సతీశ్, శ్రీకాంత్ బీమా పరామర్శించి, ఈ ఘటనకు ఎమ్మెల్యే, ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఈ ఘటనకు నిరసనగా అచ్చంపేటలో బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే గువ్వల ఫ్లెక్సీని దహనం చేశారు. అయితే ఈ ఘటనకు బాధ్యురాలిగా పేర్కొంటూ  వార్డెన్ మంగమ్మను సస్పెండ్  చేశారు. కలెక్టర్ ఉదయ్ కుమార్ ఆదేశాల మేరకు వార్డెన్​ను సస్పెండ్​ చేసినట్లు డీటీడబ్ల్యూవో కమలాకర్ రెడ్డి తెలిపారు.

నివేదికను ప్రిన్సిపల్ సెక్రటరీకి అందజేస్తాం

ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న బాలల హక్కుల కమిషన్  మెంబర్  అంజన్ రావు మన్ననూర్  ఆశ్రమ పాఠశాలను జిల్లా సీడబ్ల్యూసీ కమిటీ సభ్యులతో కలిసి శుక్రవారం తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒకేసారి 200 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడానికి వార్డెన్  మంగమ్మ నిర్లక్ష్యమే కారణమని తేలిందన్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించడం లేదని, భోజనంపై నిలదీస్తే విద్యార్థులపై కొట్టినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ ఘటనపై బాలల హక్కుల కమిషన్  చైర్మన్  ద్వారా పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి, సంబంధిత ప్రిన్సిపల్  సెక్రెటరీకి రిపోర్ట్​ అందజేస్తామని చెప్పారు. అనంతరం గ్రామంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకులం, కళాశాలను సందర్శించారు. హక్కుల కోసం విద్యార్థులు ప్రశ్నించేందుకు ముందుకు రావాలని సూచించారు.

ALSO READ: వైద్య విద్యలో తెలంగాణ నంబర్​వన్​ కరీంనగర్​ మెడికల్ కాలేజీ ప్రారంభం

అంతా నిర్లక్ష్యమే..

ఫుడ్  పాయిజన్ తో విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో శుక్రవారం ఉమ్మడి పాలమూరు జిల్లా ఫుడ్  ఇన్స్​పెక్టర్​ మనోజ్  ఆశ్రమ పాఠశాల కిచెన్ ను తనిఖీ చేశారు. ఎక్స్​పైర్​ అయిన డాల్డా ప్యాకెట్ ను గుర్తించారు. అలాగే హ్యాండ్  పంపు నుంచి వస్తున్న కలుషిత నీటినే విద్యార్థులకు అందజేస్తున్నారని, నాణ్యమైన భోజనం అందించడం లేదనే విషయం బయటపడింది. భోజనం శాంపిళ్లను సేకరించి పరీక్షల నిమిత్తం పంపిస్తామని ఆయన ఆయన తెలిపారు. వర్కర్లు, వార్డెన్  తీరుపై ఫుడ్​ సేఫ్టీ ఆఫీసర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంట సీడబ్ల్యూసీ చైర్మన్  లక్ష్మణరావు, సభ్యులు ఎల్లప్ప, ప్రసన్న, వెంకటేశ్  పాల్గొన్నారు.