3,500 ఏండ్ల నాటి బంగారు పట్నం

‘చెక్కుచెదరని’ చరిత్రకు సాక్ష్యమీ పట్నం. ఇన్నాళ్లూ ఇసుక కిందే మౌనమునిలా గప్​చుప్​గా ఉండిపోయిన ఆ ‘బంగారు పట్నం’ మళ్లీ లోకాన్ని చూసింది. ఈజిప్ట్​కు చెందిన ఆర్కియాలాజికల్​ సైంటిస్టుల తవ్వకాల్లో బయటి ప్రపంచంలోకి వచ్చింది. ఆ సిటీ పేరు ‘అటెన్​’. ‘రాజుల లోయ’గా పిలుచుకునే లగ్జర్​ సిటీకి 500 కిలోమీటర్ల దూరంలో ఉందీ నగరం. ఈజిప్ట్​ రాజు టుటెంకమిన్​ గుర్తున్నాడా? కొన్ని దశాబ్దాల కిందటే అతడి సమాధిని, ‘మమ్మీ’గా మార్చిన అతడి మృతదేహాన్ని సైంటిస్టులు గుర్తించారు. ఇప్పుడు సైంటిస్టుల తవ్వకాల్లో బయటపడిన ఈ సిటీ అతడి తాత కట్టిందే!! 

ఎన్నో విశేషాలు..
3,500 ఏండ్ల కిందట టుటెంకమిన్​ తాత కింగ్​ ఎమెనోటెప్​3 కట్టిన ఆ సిటీ.. ఇప్పటికీ చెక్కు చెదరని స్థితిలో ఉండడం చూసి సైంటిస్టులు షాక్​ అవుతున్నారు. మట్టి ఇటుకలతో కట్టిన మూడు మీటర్ల ఎత్తైన గోడలు, పాముల్లా మెలికలు తిరిగిన ప్రహరీ గోడలు, సిటీలో ఓ పెద్ద కాలనీ, అక్కడికి కొద్ది దూరంలో బేకరీ, సిటీకి మరోవైపున సమాధులు, అందులో దొరికిన జంతువుల కళేబరాలు, మనుషుల అస్థిపంజరాలు, కుండలను చూసి ఆశ్చర్యపడుతున్నారు. జాహీ హవాస్​ అనే ఆర్కియాలజీ సైంటిస్ట్​ ఆధ్వర్యంలో తవ్వకాలు జరపగా.. ఈ విశేషాలు బయటపడ్డాయి. ఇదే కాదు.. తవ్వే కొద్దీ ఆ సిటీకి సంబంధించిన ఆనవాళ్లు బయటపడుతున్నాయి. 

ఎంతో మంది ప్రయత్నించినా..
లగ్జర్​ సిటీకి 300 కిలోమీటర్ల దూరంలోని మెడినెట్​ హబూలో ఉన్న రమీసెస్​ 3, మెమ్నన్​లోని ఎమెనోటెప్​ 3 గుళ్ల మధ్య జరిపిన తవ్వకాల్లో అటెన్​ సిటీ వెలుగులోకి వచ్చింది. నిజానికి ఈ సిటీ గురించి ఎన్నో దేశాలకు చెందిన ఎంతో మంది సైంటిస్టులు రీసెర్చ్​ చేస్తూనే ఉన్నారు. కానీ, ఎవరికీ సాధ్యం కాని పనిని ఈజిప్ట్​ ఆర్కియాలజిస్టులు చేసి చూపించారు. గత ఏడాది సెప్టెంబర్​లో తవ్వకాలు ప్రారంభించగా.. కేవలం కొన్ని వారాల్లోనే ఇటుక నిర్మాణాలను చూసి సైంటిస్టులు షాక్​ అయ్యారు. మరింత తవ్వుతూ పోగా.. పెద్ద సిటీనే గుర్తించారు. దాదాపు ఏడు నెలల పాటు సాగిన తవ్వకాల్లో బయటపడిన ఈ సిటీ విశేషాలు చాలానే ఉన్నాయి. 

సిటీ ప్లాన్​ సూపర్​
అటెన్​ సిటీని ఎమెనోటెప్​3 పక్కా ప్లాన్​ ప్రకారం కట్టినట్టు సైంటిస్టులు చెప్తున్నారు. సిటీకి దక్షిణాన బేకరీ ఉందని, ఎంత మందికైనా వండి పెట్టేలా భారీ కిచెన్​ అందులో ఉందని అంటున్నారు. వండేందుకు పెద్ద పెద్ద పొయ్యిలు, వండిన భోజనాన్ని దాచేందుకు పెద్ద పెద్ద కుండలు అక్కడ ఉన్నాయంటున్నారు. ఇక, రెండో భాగంలో పరిపాలన, జనం నివసించేందుకు రెసిడెన్షియల్​ కాంప్లెక్స్​లు నిర్మించారని చెబుతున్నారు. అన్నింటినీ పద్ధతి ప్రకారం కట్టారంటున్నారు. ఒక్కో ఇంటి గోడ ఎత్తు 3 మీటర్లకుపైనే ఉందని గుర్తించారు. ఇక, పాలనా, రెసిడెన్షియల్​ యూనిట్​ చుట్టూ పాములా వంకర్లు తిరిగిన ప్రహరీని గుర్తించిన సైంటిస్టులు.. శత్రువులను కన్ఫ్యూజ్​ చేయడంలో భాగంగానే అలా కట్టి ఉంటారని భావిస్తున్నారు. ఇక, అందులోనూ వచ్చేందుకు, పోయేందుకు ఒకే ఒక్క గేటు ఉందని, భద్రతకు అది చాలా కీలకంగా మారిందని అంటున్నారు. మూడో భాగానికి సంబంధించి.. పని ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఇళ్లను, రాజుగారి మహల్​ను కట్టేందుకు బంక మట్టి ఇటుకలను ఇక్కడే తయారు చేసినట్టు చెబుతున్నారు. అంతేకాదు, రోజువారీ అవసరాల్లో భాగమైన పనిముట్ల తయారీ, ఇతర వృత్తులూ అక్కడి నుంచే సాగేవని అంటున్నారు. 

యూఫ్రటీస్​ నుంచి సూడాన్​ దాకా..
ఎమెనోటెప్​ 3. యూఫ్రటీస్​ నుంచి సూడాన్​ దాకా పరిపాలన సాగించినట్టు సైంటిస్టులు చెబుతున్నారు. 40 ఏండ్ల పాటు రాజ్యాన్ని పాలించిన అతడు.. తాను, తన భార్యకు గుర్తుగా లగ్జర్​కు సమీపంలో ‘కలోజి ఆఫ్​ మెమ్నన్​’ అనే రెండు భారీ రాతి విగ్రహాలను నిర్మించాడు. క్రీస్తుపూర్వం 1354వ సంవత్సరంలో అతడు చనిపోయాడని చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత అతడి కొడుకైన అఖెనాటెన్​ రాజ్యాన్ని పాలించాడు. అతడి తర్వాత టుటెంకమిన్​ పగ్గాలు అందుకున్నాడు. చిన్న వయసులోనే పెండ్లి చేసుకున్న అతడు.. 18వ ఏటనే చనిపోయాడని చెప్తారు.

దొరికినవివీ..
నూలు వడికేందుకు, బట్టలు నేసేందుకు వాడే పనిముట్లు, లోహం, గాజుతో చేసిన వస్తువులు, పూల కుండీలు, నగలు, అదృష్టంగా భావించే లాకెట్లను తయారు చేసే అచ్చులు, మద్యం బాటిళ్లు, బీటిల్​ పురుగుల ఆనవాళ్లను కనిపెట్టారు. వాటితో పాటు మనుషుల అస్థిపంజరాలు, ఆవు లేదా ఎద్దు కళేబరాలను గుర్తించారు. అంతేకాకుండా, గుళ్లు, సమాధులను డెకరేట్​ చేసేందుకు అవసరమయ్యే పరికరాలనూ కనుగొన్నారు.