- పక్కన పడేసిన పాత సర్కార్
- ప్రభుత్వ స్కీంలకు దూరమవుతున్న రైతులు
- కొత్త సర్కార్ మీద దరఖాస్తుదారుల ఆశలు
పెద్దపల్లి, వెలుగు: సాదా బైనామాలకు పట్టాలు ఇస్తామని గత బీఆర్ ఎస్ సర్కారు ప్రకటించడంతో పెద్దపల్లి జిల్లాలో దాదాపు 35 వేల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ పట్టాలు ఇవ్వకపోవడంతో రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి, రైతు బంధు లాంటి స్కీంలు రావడం లేదు. గతంలో భూముల కొనుగోళ్లు అన్నీ సాదా బైనామాలతోనే జరిగేవి. బీఆర్ ఎస్ సర్కార్ రాగానే సాదాబైనామాలను రెగ్యులర్ చేసి పట్టాలిస్తామని చెప్పడంతో రైతులంతా ఆఫీసుల చుట్టూ నెలల తరబడి తిరిగి దరఖాస్తు చేసుకున్నారు.
సాదాబైనామాలు కలిగి ఉన్న రైతులు భూములను తమ అవసరాలకు అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. 2014 జూన్ 2 తేదీలోపు సాదాబైనామాల ద్వారా భూములు కొనుగోలు చేసిన వారి భూములను ఆర్ ఓఆర్ చేసి పట్టాలు జారీ చేసేలా ఆనాటి బీఆర్ ఎస్ సర్కార్మార్గదర్శకాలు విడుదల చేసింది. 2020 అక్టోబర్ 1 నుంచి 31 వరకు దరఖాస్తులు తీసుకున్నారు. ఈ గడువును మరి కొంత కాలం పొడిగించారు. అప్లికేషన్లు ఆన్లైన్ ద్వారా తీసుకోవడంతో రైతులు మీసేవా సెంటర్ల చుట్టూ తిరగాల్సి వచ్చింది. మొత్తంగా 35 వేల పై చిలుకు అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న రైతులు...
సాదాబైనామాల రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న రైతులు తహసీల్దార్, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. సాదాబైనామాలు రెగ్యులర్ చేస్తామని సర్కార్ చెప్పడంతో రైతులు, గతంలోని భూయజమానుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. చాలా మంది భూయజమానులు గ్రామాలను వదిలేసి పట్టణాల్లో సెటిల్ అయ్యారు. వారికి భూములు ఉన్నాయనే విషయమే మరిచిపోయారు.
అలాంటి వారికి కలిసి సాదాబైనామాలకు నోఆబ్జెక్షన్ సంతకం చేయాలని కోరడానికి పట్టణాల చుట్టూ తిరగాల్సి వచ్చింది. చాలా గ్రామాల్లో నో ఆబ్జెక్షన్ సైన్ కోసం పాత భూయజమానులు ఎకరానికి రూ. 10 వేలు తీసుకున్నట్లు సమాచారం. నానా తంటాలు పడి దరఖాస్తు చేసుకుంటే పాత సర్కార్ వాటిని పట్టించుకోకుండా పోయిందని, ప్రస్తుతం ఏర్పడ్డ కాంగ్రెస్ సర్కార్ అయినా సమస్యను వెంటనే పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.
స్కీంలకు దూరమవుతున్న రైతులు...
సాదాబైనామా భూములు కలిగి ఉన్న రైతులకు ఆనాటి సర్కార్ రైతుబంధు లాంటి స్కీం వర్తింపజేయలేదు. సాదాబైనామా అప్లికేషన్లు పరిశీలించిన అధికారులు, కోర్టులో కేసు ఉన్నదని పట్టాల జారీ పెండింగ్లో పెట్టింది. గత సర్కార్ కోర్టులో కౌంటర్ పిటిషన్ వేయకపోవడం వల్లనే దరఖాస్తుల పరిశీలన పూర్తి కాలేదనే ఆరోపణలున్నాయి. ఇప్పటికీ చాలా దరఖాస్తులు తహసీల్దార్ ఆఫీసుల్లోనే ఉన్నట్లు సమాచారం. ఆనాటి సర్కార్ తీరు వల్లే రైతుబంధు, రైతుబీమా, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధాని కిసాన్సమ్మాన్, ఇతర సబ్సిడీ స్కీంలకు దూరం కావాల్సి వచ్చిందని రైతులు వాపోతున్నారు.