టోక్యో: జపాన్‌లోని అత్యంత రద్దీగా ఉండే ఎయిర్‌పోర్టులో ఓ కత్తెర కనిపించకుండా పోయినందుకు 36 విమానాలు రద్దయ్యాయి. 200లకు పైగా విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. హక్కైడో ఐల్యాండ్‌లో ఉన్న చిటోస్ ఎయిర్‌పోర్టులో గత శనివారం ఈ ఘటన జరిగింది.ఎయిర్‌పోర్టులోని ఓ రిటైల్ స్టోర్‌లోని కత్తెర కనిపించకుండా పోయింది. ఈ విషయాన్ని ఎయిర్పోర్ట్ అధికారులకు తెలియడంతో వాళ్లు సెర్చింగ్ మొదలు పెట్టారు.
ఎయిర్‌పోర్టుకు వచ్చే ప్రయాణికులను ఆపిమరీ కత్తెర కోసం జల్లెడ పట్టారు. అలా 2గంటలపాటు వెతికారు. దీంతో బయల్దేరాల్సిన 36 విమానాలను రద్దు చేశారు. వందలాది మందితో క్యూలైన్లు పెరగడంతో 200కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. భద్రతాపరమైన చర్యల్లో భాగంగానే తనిఖీలు చేపట్టినట్లు చెప్పిన అధికారులు.. ఆఖరికి కనిపించకుండా పోయిన కత్తెరను అదే స్టోర్‌లో గుర్తించినట్లు వెల్లడించారు.