- మూడేండ్లలో ప్రతి జిల్లా ఆసుపత్రిలో డే కేర్ క్యాన్సర్ సెంటర్
- 36 రకాల లైఫ్ సేవింగ్మెడిసిన్పై కస్టమ్స్ డ్యూటీ ఎత్తివేత
- ఐదేండ్లలో కొత్తగా 75 వేల మెడికల్ సీట్లు
- వచ్చే ఆర్థిక సంవత్సరం 10 వేల సీట్లు పెంపు
- మెడికల్ టూరిజం పెంచేందుకు ‘హీల్ ఇండియా’కు ప్రోత్సాహం
- ఆరోగ్య రంగానికి రూ.99,858 కోట్ల కేటాయింపులు
- గత బడ్జెట్ కంటే 9.78 శాతం ఎక్కువ నిధులు
న్యూఢిల్లీ:క్యాన్సర్ ట్రీట్మెంట్లో వాడే పలు రకాల మందులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ)ని పూర్తిగా మినహాయిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.
దీంతో ఆయా మందుల ధరలు తగ్గి.. బాధితులకు ఆర్థిక భారం కొంత తగ్గుతుందని ఆమె అన్నారు. అలాగే రానున్న ఐదేండ్లలో దేశవ్యాప్తంగా 75 వేల మెడికల్ సీట్లు పెంచనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే 10 వేల సీట్లు పెంచనున్నట్టు చెప్పారు.
గత పదేండ్లలో తమ ప్రభుత్వం దాదాపు 1.1 లక్షల మెడికల్ యూజీ, పీజీ సీట్లను పెంచిందన్నారు. ఇది మొత్తం మెడికల్ సీట్లలో 130 శాతం పెరుగుదల అన్నారు. అలాగే మూడేండ్లలో దేశంలోని అన్ని జిల్లా ఆసుపత్రుల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
ఇందులో 200 సెంటర్లు 2025-–26లోనే స్థాపిస్తామని తెలిపారు. దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నందున ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
ఈ సెంటర్లతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్‌పై అవగాహన, బాధితుల్లో లక్షణాలను త్వరగా గుర్తించడం, ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా మారకముందే ట్రీట్మెంట్ పొందే అవకాశాలున్నాయి.
కెపాసిటీ బిల్డింగ్, వీసా నిబంధనలు సులభతరం చేయడం, ప్రైవేట్ రంగంతో పార్ట్నర్షిప్ ద్వారా మెడికల్ టూరిజం పెంచేలా ‘హీల్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రోత్సహించనున్నట్లు ఆమె చెప్పారు. అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లకు ‘‘భారత్ నెట్ ప్రాజెక్టు’’ కింద బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీని అందిస్తామన్నారు.
నేషనల్ హెల్త్ మిషన్‌కు రూ.37 వేల కోట్లు
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు 2025- 26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.99,858.56 కోట్లు కేటాయించింది. ఈ కేటాయింపులు గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 9.78 శాతం ఎక్కువ. 2024- 25లో ఆరోగ్య రంగం కోసం బడ్జెట్లో రూ.90,958.63 కోట్ల నిధులు ఇచ్చారు.
ఆరోగ్య శాఖకు బడ్జెట్లో పేర్కొన్న రూ.99,858 కోట్లలో హెల్త్ కేర్‌కు రూ.95,957.87 కోట్లు, కుటుంబ సంక్షేమ శాఖకు రూ.3,900.69 కోట్లు కేటాయించారు. హెల్త్ కోసం కేటాయించిన మొత్తం నిధుల్లో అత్యధికంగా నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం)కు రూ.37,226.92 కోట్లు దక్కనున్నాయి.
ఆ తర్వాత ఎయిమ్స్‌కు రూ.5,200 కోట్లు, ఐసీఎంఆర్‌కు రూ.3,125.50 కోట్లు, ఆయుష్మాన్ భారత్‌కు రూ.9,406 కోట్లు, నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌కు రూ.340.11 కోట్లు ఖర్చు చేయనున్నారు.
ఆ బల్క్ డ్రగ్స్‌పై కూడా కస్టమ్స్ డ్యూటీ ఎత్తివేత
క్యాన్సర్ ట్రీట్మెంట్లో వాడే మెడిసిన్ ట్రాస్టూజుమాబ్ డెరుక్స్‌టెకాన్, ఒసిమెర్టినిబ్, దుర్వాలుమాబ్‌లపై ఉన్న 10 శాతం కస్టమ్స్ డ్యూటీని ఇదివరకే ఎత్తేసినట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత బడ్జెట్లో ఈ మందులతో సహా 36 రకాల మెడిసిన్ పై బీసీడీని పూర్తిగా ఎత్తేస్తున్నట్టు తెలిపారు.
ఈ జాబితాలో క్రిటికల్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు వినియోగించే పలు రకాల మెడిసిన్ ఉన్నాయి. మరో 6 లైఫ్ సేవింగ్ మెడిసిన్‌ను 5% బీసీడీ లిస్ట్‌లో చేరుస్తున్నట్టు చెప్పారు. కస్టమ్స్ డ్యూటీ మినహాయించిన, తగ్గించిన మెడిసిన్ తయారీకి ఉపయోగించే బల్క్ డ్రగ్స్‌పై కూడా కస్టమ్స్ డ్యూటీ పూర్తి మినహాయింపు వర్తిస్తుందన్నారు.
వ్యాధుల బాధిత వ్యక్తులు, కుటుంబాలకు ఇది ఆర్థిక భారం తగ్గించడంలో దోహదపడుతుందన్నారు. ఫార్మాస్యూటికల్ కంపెనీలు నిర్వహించే పేషెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్‌ల కింద రోగులకు ఫ్రీగా పంపిణీ చేసే 37 రకాల మెడిసిన్, 13 కొత్త డ్రగ్స్‌కు కూడా బీసీడీ పూర్తిగా ఎత్తేస్తున్నట్టు ప్రకటించారు.