- చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన జై షా
దుబాయ్ : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మరోసారి ఇండియా అడ్మినిస్ట్రేటర్ చేతుల్లోకి వచ్చింది. ఐసీసీ కొత్త చైర్మన్‌గా 36 ఏండ్ల జై షా ఆదివారం బాధ్యతలు చేపట్టారు. గత ఐదేండ్ల పాటు బీసీసీఐ సెక్రటరీగా ఇండియన్ క్రికెట్‌పై తనదైన ముద్ర వేసిన షా ఇంటర్నేషల్ క్రికెట్ బాడీ యంగెస్ట్ చైర్మన్‌గా రికార్డు సృష్టించారు. ఇండియా నుంచి దివంగత జగ్‌మోహన్ దాల్మియా, శరద్ పవార్, శశాంక్ మనోహర్, ఎన్. శ్రీనివాసన్ తర్వాత ఐసీసీ పీఠంపై కూర్చున్న ఐదో వ్యక్తిగా షా నిలిచారు.
ఐసీసీ అధిపతిగా ప్రస్తుతం షా ముందున్న ప్రధాన కర్తవ్యం చాంపియన్స్ ట్రోఫీ విషయంలో అనిశ్చితిని తొలగించడం. చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మాట్లాడిన జై షా చాంపియన్స్ ట్రోఫీ ప్రస్తావన తీసుకురాలేదు. తన టర్మ్‌లో 2028లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో టీ20 క్రికెట్ ఎంట్రీ, ఈ ఆటను ముఖ్యంగా విమెన్స్ క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేయడం తన ప్రాధాన్యతలు అని చెప్పారు.