భారతదేశం జి20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టి గురువారంతో 365 రోజులు పూర్తవుతున్నాయి. ‘వసుధైక కుటుంబం’... అంటే- ‘ఒకే భూమి. -ఒకే కుటుంబం-. ఒకే భవిష్యత్తు’ స్ఫూర్తిని చాటేలా పునరంకితమవుతూ.. పునరుజ్జీవనానికి బీజం వేసిన క్షణమది. మనం నిరుడు అధ్యక్ష బాధ్యత స్వీకరించే నాటికి యావత్ ప్రపంచం బహుముఖ సవాళ్లతో సతమతం అవుతోంది. కొవిడ్-19 మహమ్మారి దుష్ప్రభావం నుంచి కోలుకోవడం, నానాటికీ పెరుగుతున్న వాతావరణ మార్పు సమస్యలు, ఆర్థిక అస్థిరత, వర్ధమాన దేశాల్లో రుణభారం తదితర సమస్యలెన్నో చోటు చేసుకున్నాయి. అలాగే ఘర్షణలు, వివాదాలు, స్పర్ధల మధ్య ప్రగతి సంబంధిత సహకార భావన దెబ్బతిని, పురోగమనం కుంటుపడింది. ఈ నేపథ్యంలో జి20 నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన భారతదేశం ఆనాటి దుస్థితి నుంచి ప్రపంచాన్ని గట్టెక్కించి,
ప్రత్యామ్నాయం చూపాలని నిశ్చయించుకుంది. ఇందులో భాగంగా జిడిపి కేంద్రీకృత ప్రగతి నుంచి మానవ- కేంద్రక పురోగమనం వైపు మళ్లాల్సిన అవసరాన్ని స్పష్టం చేసింది. మన మధ్య విభజన తెస్తున్న కారణాన్ని కాకుండా మనల్ని ఏదైతే ఏకం చేయగలదో దాని గురించి గుర్తుచేయడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీంతో అంతిమంగా అంతర్జాతీయ చర్చలు ఫలవంతమై- కొందరి స్వార్థానికి కాకుండా అందరి ఆకాంక్షలు, ప్రయోజనాలకు పెద్దపీట వేయక తప్పలేదు.
ఆఫ్రికా సమాఖ్యకు శాశ్వత సభ్యత్వం
‘‘సార్వజనీనత, ఆకాంక్షాత్మక, కార్యాచరణ, నిర్ణయాత్మకత’’ అనే నాలుగు పదాలు జి20 అధ్యక్ష బాధ్యతల నిర్వహణలో మన విధానమేమిటో సుస్పష్టంగా నిర్వచించాయి. అనంతరం జి20 సభ్యదేశాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదించిన ‘న్యూఢిల్లీ దేశాధినేతల తీర్మానం’ (ఎన్డీఎల్డీ) ఈ సూత్రాల అమలులో మన నిబద్ధతను స్పష్టం చేసింది. సార్వజనీనత అన్నది మన అధ్యక్ష పదవికి ఆత్మవంటిది. దీనికి అనుగుణంగా ఆఫ్రికా సమాఖ్య (ఎయు)కు జి20లో శాశ్వత సభ్యత్వం కల్పించడం ద్వారా 55 ఆఫ్రికా దేశాలను ఈ వేదిక మీదకు చేర్చాం.
దీంతో ప్రపంచ జనాభాలో 80 శాతానికి ప్రాతినిధ్యం వహించే విధంగా జి20 విస్తరించింది. ఇక ‘దక్షిణ ప్రపంచ దేశాల గళం’ పేరిట భారతదేశం తొలిసారి రెండు దఫాలుగా నిర్వహించిన శిఖరాగ్ర సదస్సు బహుపాక్షికత నవోదయానికి శుభారంభం పలికింది. ఆ విధంగా దక్షిణ దేశాల సమస్యలను భారతదేశం అంతర్జాతీయ చర్చల ప్రధాన స్రవంతిలోకి తెచ్చింది. వర్ధమాన దేశాలు తమవంతు ప్రాతినిధ్యం వహించే కొత్త శకానికి నాంది పలికింది.
140 కోట్ల మంది పౌరులకు జి20 చేరువ
సార్వజనీనత అన్న భారత దేశీయ విధానాన్ని భారత్ జి20కి వ్యాపింపజేసింది. ఆ మేరకు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి తగినట్లుగా జి20కి భారత నాయకత్వం ప్రజాధ్యక్షతగా రూపొందింది. ఈ మేరకు ‘ప్రజా భాగస్వామ్యం’ కింద నిర్వహించిన అనేక కార్యక్రమాల ద్వారా 140 కోట్ల మంది పౌరులకు జి20 చేరువైంది. ఇందులో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకూ భాగస్వామ్యం ఇవ్వబడింది. అలాగే జి20 నిర్దేశాలకు అనువుగా వాస్తవిక అంశాలపై అంతర్జాతీయ దృష్టిని విస్తృత ప్రగతి లక్ష్యాల వైపు మళ్లించేలా భారత్ బాధ్యత వహించింది.
ప్రపంచం సాధించాల్సిన లక్ష్యాలపై 2030 నాటి గడువుకు నేడు మనం అత్యంత కీలకమైన దశలో ఉన్నాం. ఆరోగ్యం, విద్య, లింగ సమానత్వం, పర్యావరణ సమతుల్యం, పరస్పర అనుసంధాన సమస్యల పరిష్కారం కోసం విస్తృత కార్యాచరణ- ఆధారిత విధానాలను సూచించింది.
డిజిటల్ ఆవిష్కరణల విప్లవాత్మక ప్రభావం
ప్రగతి ప్రణాళిక పురోగమనానికి జనహిత మౌలిక సదుపాయాలు (డిపిఐ) అత్యంత కీలకం. ఆ మేరకు ‘ఆధార్, యుపిఐ, డిజిలాకర్’ వంటి డిజిటల్ ఆవిష్కరణల విప్లవాత్మక ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూసిన భారత్ తనవంతుగా నిర్ణయాత్మక సిఫారసులు చేసింది. జి20 ద్వారా మనం జనహిత మౌలిక సదుపాయాల భాండాగారం ఏర్పాటును విజయవంతంగా పూర్తి చేశాం. దీన్ని ప్రపంచ సాంకేతిక సహకారంలో గణనీయ పురోగమనంగా పేర్కొనవచ్చు. ఈ కోశాగారంలో 16 దేశాల నుంచి 50కిపైగా దేశాల ‘డిపిఐ’లున్నాయి. సమగ్రాభివృద్ధి శక్తిని సద్వినియోగం చేసుకునే దిశగా దక్షిణ దేశాలు వీటిని అనుసరించడమేగాక, తమదైన
‘డిపిఐ’ల నిర్మాణం, వినియోగం కోసం ఈ రిపోజిటరీని చక్కగా వాడుకోవాలి. మన ఏకైక భూమండలం కోసం తక్షణ, శాశ్వత, సమాన మార్పు సృష్టి లక్ష్యంగా మనం ప్రతిష్టాత్మక, సమగ్రమైన లక్ష్యాలను అనుసరిస్తున్నాం. భూగోళ పరిరక్షణ, పేదరిక నిర్మూలన క్రమంలో మన ఎంపికకు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనడం ఎలాగో ‘ఎన్డీఎల్డీ’ నిర్దేశిత ‘హరిత ప్రగతి ఒప్పందం’ వివరిస్తుంది. వాతావరణ స్పృహతో వినియోగం, భూగోళ హిత ఉత్పాదనకు తగిన ప్రణాళికను సూచిస్తుంది.
పునరుత్పాదక ఇంధన సామర్థ్యం పెంపు
2030 నాటికి ప్రపంచ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని ప్రతిష్టాత్మక రీతిలో మూడు రెట్లు పెంచాలని జి20 తీర్మానం పిలుపునిచ్చింది. మరోవైపు ప్రపంచ జీవఇంధన కూటమి ఏర్పాటు, హరిత ఉదజని కోసం సమష్టి కృషి, హరిత ప్రపంచ నిర్మాణంపై జి20 ఆదర్శాలు కాదనలేని నిజాలు. ఉత్తరార్థ ప్రపంచ దేశాల నుంచి గణనీయ ఆర్థిక సహాయంతోపాటు సాంకేతిక చేయూతను కోరడం ద్వారా వాతావరణ న్యాయ-సమానత్వం విషయంలో మన నిబద్ధతను కూడా ‘ఎన్డీఎల్డీ’ నొక్కి చెప్పింది. కాగా, అభివృద్ధికి ఆర్థిక చేయూత పరిమాణంలో తొలిసారిగా ఆశించిన మేర రెట్టింపు పెరుగుదల నమోదైంది. వర్ధమాన దేశాలు 2030 నాటికి తమ దేశీయ ప్రగతి లక్ష్యాల (ఎన్డీసీ)ను సాధించడానికి $5.9 ట్రిలియన్ డాలర్లు అవసరమని జి20 అంగీకరించింది.
భారీ స్థాయిలో నిధుల సమీకరణ అవసరం దృష్ట్యా మెరుగైన, విస్తృత, ప్రభావశీల బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల ప్రాముఖ్యాన్ని కూడా జి20 సుస్పష్టం చేసింది. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు చేపట్టాలన్న డిమాండ్ విషయంలోనూ భారత్ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ఐరాస భద్రత మండలి వంటి ప్రధానాంగాల పునర్నిర్మాణం మరింత సమాన ప్రపంచ క్రమాన్ని నిర్ధారిస్తుంది.
ఇది యుద్ధ యుగం కాదు
లింగ సమానత్వానికీ న్యూఢిల్లీ దేశాధినేతల తీర్మానం (ఎన్డీఎల్డీ) పెద్దపీట వేసింది. మహిళా రిజర్వేషన్ బిల్లు-2023 ద్వారా పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలలో మూడింట ఒక వంతు స్థానాలను మహిళలకు కేటాయించడం ద్వారా మహిళా చోదక ప్రగతిపై భారత్ నిబద్ధతను జి20 ప్రతిబింబించింది. మన అధ్యక్షత సమయంలో జి20 ద్వారా 87 నిర్ణయాలు తీసుకోవడంతోపాటు 118 పత్రాలకు ఆమోదం సాధించడం హర్షణీయం. జి20 అధ్యక్షత సమయంలో భౌగోళిక- రాజకీయాంశాలు, ఆర్థికవృద్ధి -ప్రగతిపై వాటి ప్రభావం తదితర అంశాలపై చర్చలకు భారత్ నాయకత్వం వహించింది. ఉగ్రవాదం, విచక్షణా రహితంగా పౌరుల ప్రాణాలు తీయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది.
మనం శత్రుత్వం స్థానంలో మానవత్వాన్ని స్వీకరించాలి. ఆ మేరకు ఇది యుద్ధ యుగం కాదనే వాస్తవాన్ని పునరుద్ఘాటించాలి. ఈ నేపథ్యంలో భూగోళం పచ్చగా పరిఢవిల్లడంతోపాటు ప్రపంచ ప్రజానీకానికి శాంతి, -శ్రేయస్సు దిశగా ఇప్పటివరకూ మనం సమష్టిగా చేసిన కృషి భవిష్యత్తులోనూ కొనసాగుతుందని విశ్వసిస్తూ జి20 అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ దేశానికి అప్పగిస్తున్నాం.
- నరేంద్ర మోదీ, భారత ప్రధాన మంత్రి