ఎండలు షురూ.. ఆదిలాబాద్ జిల్లాలో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు

ఎండలు షురూ.. ఆదిలాబాద్  జిల్లాలో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మొదలయ్యాయి. మొన్నటివరకు చల్లి తీవ్రతతో వణికిపోయిన జిల్లా రెండు మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. వారం క్రితం వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు 28 నుంచి 30 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 8 డిగ్రీల నుంచి 10 డిగ్రీలు నమోదైంది. అయితే గత రెండు రోజుల నుంచి 37 డిగ్రీలు నమోదవుతోంది. మంగళవారం 37.03 గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా కనిష్టంగా 16.07 డిగ్రీలు నమోదైంది.

ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎండలు ఈ స్థాయిలో ఉన్నాయంటే వేసవిలో ఈసారి మరింత అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మార్చి, ఎప్రిల్ నెలల్లో 45  డిగ్రీలకు చేరువయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే ఈసారి అధిక వర్షాలు కురిసినప్పటికీ ఎండల తీవ్రతతో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. డిసెంబర్​లో 6 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండగా జనవరిలో 7 మీటర్ల లోతుకు పడిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో వచ్చే మూడు నెలలు నీటి సమస్య మరింత తీవ్ర మయ్యే అవకాశం ఉంది.