పెషావర్: పాకిస్తాన్లో రెండు తెగల మధ్య ఘర్షణ తలెత్తి 37 మంది మృతి చెందారు. మరో 30 మంది గాయాలపాలయ్యారు. వాయువ్య పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పరాచినార్ సమీపంలో గురువారం ప్రయాణికులతో వెళ్తున్న వాహనాల కాన్వాయ్‌పై దాడి జరిగి 47 మంది మరణించారు.
దీంతో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని కుర్రం జిల్లాలో అలీజాయ్, బగన్ అనే గిరిజన తెగల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఈ ఘర్షణల్లో గత 24 గంటల్లో 37 మంది మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని శనివారం పోలీసులు తెలిపారు. అధికార యంత్రాంగం, పోలీసు ఉన్నతాధికారులు హెలికాప్టర్‌లో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. భారీ ఆటోమేటిక్ ఆయుధాలతో గిరిజనులు ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు.
బలిష్‌ఖేల్, ఖార్ కాలీ, కుంజ్ అలీజాయ్, మక్బల్‌లలో కాల్పులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ ఘర్షణల్లో ఇండ్లు, దుకాణాలు దెబ్బతినడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. అలాగే, జిల్లాలోని అన్ని విద్యాసంస్థలను శనివారం మూసివేశారు. ఆరుగురు మహిళలను బందీలుగా తీసుకున్నట్టు తెలిసింది. కాగా, సెప్టెంబర్‌లో కుర్రం జిల్లాలో ఒక భూభాగం విషయంలో షియా, సున్నీ తెగల మధ్య ఎనిమిది రోజుల పాటు జరిగిన ఘర్షణల్లో 50 మందికి పైగా మరణించారు. 120 మంది గాయపడ్డారు.