- పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు
- రోడ్ రోలర్, డోజర్ గుర్తులపై టీఆర్ఎస్ ఆందోళన
నల్గొండ, వెలుగు: మునుగోడు ఉప ఎన్నిక బరిలో 47 మంది అభ్యర్థులు మిగిలారు. మొత్తం 130 నామినేషన్లు దాఖలు కాగా, స్క్రూటినీ తర్వాత 83 మంది అభ్యర్థుల నామినేషన్లు ఓకే అయ్యాయి. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి 36 మంది అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో 47 మంది తుది పోటీలో మిగిలినట్లు అధికారులు ప్రకటించారు. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతితోపాటు మరికొంత మంది రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. గుర్తుల కేటాయింపును సోమవారం రాత్రి 10.35 గంటలకు అధికారులు పూర్తి చేశారు. అయితే పలువురు అభ్యర్థులకు రోడ్ రోలర్, డోజర్ గుర్తులను కేటాయించడంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు సోమవారం రాత్రి చండూరులోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. నల్గొండలో జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. సాగర్, నకిరేకల్ ఎన్నికల్లో రోడ్ రోలర్, డోజర్, ఆటో గుర్తుల కారణంగానే పార్టీకి తీవ్ర నష్టం కలిగిందని, ఈ ఎన్నికలో ఆ గుర్తులను తొలగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశామని, అయినప్పటికీ ఎన్నికల కమిషన్ తమ అభ్యర్థనను పట్టించుకోకుండా గుర్తులు కేటాయించిందని మండిపడ్డారు.
స్వతంత్రులకు బుజ్జగింపులు
నామినేషన్లు వేసిన స్వతంత్ర అభ్యర్థులను తప్పించేందుకు ఉదయం నుంచి అధికార పార్టీ లీడర్లు తీవ్రంగా శ్రమించారు. పలువురు క్యాండిడేట్ల వల్ల టీఆర్‌ఎస్ అభ్యర్థికి నష్టం జరుగుతుందనే అంచనా ఉండడంతో స్వయంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరావు రంగంలోకి దిగారు. ఆయన నేతృత్వంలో పలువురు టీఆర్ఎస్ లీడర్లు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇండిపెండెంట్లను బుజ్జగించి, నామినేషన్లను విత్‌డ్రా చేయించారు. ఈ క్రమంలో పెద్దమొత్తంలో డబ్బు చేతులు మారిందనే ప్రచారం జరిగింది.
మూడు బ్యాలెట్ యూనిట్లు
ప్రస్తుతం ఉన్న ఈవీఎంలలో 16 మంది అభ్యర్థులకు ఒక బ్యాలెట్ మాత్రమే వినియోగిస్తారు. మునుగోడు బరిలో 47 మంది అభ్యర్థులు ఉండడంతో 3 బ్యాలెట్ యూనిట్స్, ఒక వీవీప్యాట్ వాడాల్సి వస్తోంది. అంటే ఒక్కో పోలింగ్ బూత్‌లో టేబుల్‌పై మూడు బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తామని ఆఫీసర్లు తెలిపారు.