- ఈ నెలాఖరు నాటికి జత చేయనున్న ఇండియన్ రైల్వే
సికింద్రాబాద్, వెలుగు: ప్యాసింజర్ల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెలాఖరు నాటికి 370 రైళ్లకు వెయ్యి అదనపు జనరల్ కోచ్‌లను జత చేయనున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో మంగళవారం రైల్వే బోర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ మాట్లాడారు. "రైల్వేలకు జనరల్ కేటగిరీ ప్రయాణికులే అత్యంత ముఖ్యం. వారికి మంచి సౌకర్యాలు కల్పించేందుకు రైల్వే కృషి చేస్తున్నది. ఈ క్రమంలోనే గత మూడు నెలల్లో వివిధ రైళ్లకు సుమారు ఆరు వందల కొత్త జనరల్ క్లాస్ (జీఎస్) అదనపు కోచ్‌లను చేర్చింది.
ఈనెలాఖరునాటికి దాదాపు 370 రైళ్లకు వెయ్యి కోచ్‌లను చేర్చనుంది. ఇవే కాకుండా.. రానున్న రెండేండ్లల్లో రైల్వేలో 10వేలకు పైగా నాన్-ఏసీ క్లాస్ కోచ్‌లను జత చేసే పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ కొత్త కోచ్‌లు అత్యాధునికంగా ఉండనున్నాయి. సాంప్రదాయ ఐసీఎఫ్ రైలు కోచ్‌లతో పోలిస్తే.. ఈ ఎల్ఎచ్ బీ కోచ్‌లు తేలికగా, దృఢంగా ఉంటాయి. ఒకవేళ అనుకోని ప్రమాదం జరిగినా నష్టం చాలా తక్కువగా ఉంటుంది" అని దిలీప్ కుమార్ పేర్కొన్నారు.
-
పలు రైళ్ల నంబర్లను మార్చనున్న ఎస్సీఆర్
పలు రైళ్ల నంబర్లను మార్చనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) తెలిపింది. వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నట్టు చెప్పింది. విశాఖపట్నం-కడప మధ్య నడుస్తున్న రైలు 17488 నంబరుతో నడుస్తుండగా ఇక నుంచి 18521 నంబరుతో అందుబాటులోకి రానుంది. కడప–విశాఖపట్నం రైలు 17487 నంబరుకు బదులుగా18522 నంబరుతో, విశాఖపట్నం–గుంటూరు రైలు 22701కు బదులు22875తో, గుంటూరు–విశాఖపట్నం రైలు 22702కు బదులుగా 22876తో, భువనేశ్వర్–రామేశ్వరం రైలు 20896కు బదులుగా 20895తో, రామేశ్వరం–భువనేశ్వర్ రైలు20895కు బదులుగా 20896 నంబరుతో అందుబాటులోకి రానున్నాయి.