ఇంజినీరింగ్ ‘మాప్ అప్’ అడ్మిషన్లపై అయోమయం

ఇంజినీరింగ్ ‘మాప్ అప్’ అడ్మిషన్లపై అయోమయం
  • 14 ప్రైవేటు కాలేజీల్లో 376 మందికి అడ్మిషన్లు 
  • వాటిని రాటిఫై చేయని విద్యాశాఖ అధికారులు 
  • సర్కారుకు ఫైల్.. ఆందోళనలో స్టూడెంట్లు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో తొలిసారిగా ఈ ఏడాది విద్యాశాఖ నిర్వహించిన మాప్ అప్ ఇంజినీరింగ్ అడ్మిషన్లపై అయోమయం నెలకొంది. విద్యా సంవత్సరం పూర్తికావొస్తున్నా ఇప్పటికీ ఆ విద్యార్థుల అడ్మిషన్లను సర్కారు గుర్తించలేదు. అధికారులు ఇప్పటికీ వాటిని రాటిఫై చేయలేదు. దీంతో విద్యార్థులు, వారి పేరెంట్స్ లో ఆందోళన మొదలైంది. స్టేట్​లో 2024–25 విద్యాసంవత్సరంలో ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో సీఎస్ఈతో పాటు పలు కోర్సుల్లో సీట్ల పెంపునకు ఏఐసీటీఈ అనుమతి ఇచ్చింది. దీనికి జేఎన్టీయూహెచ్​ కూడా ఎన్​ఓసీ ఇచ్చింది.

 అయితే, ఆయా కాలేజీల్లో కొత్త సీట్ల పెంపును సర్కారు మాత్రం ఆమోదించలేదు. దీంతో14 ప్రైవేటు కాలేజీలు హైకోర్టును ఆశ్రయించగా.. వెంటనే మాప్ అప్ కౌన్సెలింగ్ నిర్వహించాలని సర్కారును ఆదేశించింది. తొలుత సర్కారు పెద్దగా పట్టించుకోకపోవడంతో హైకోర్టు సీరియస్ అయింది. దీంతో అనివార్యంగా అధికారులు ఆదరబాదరాగా అడ్మిషన్లు నిర్వహించారు. అయితే, హైకోర్టు ఆదేశాలు వచ్చేనాటికే ఇంజినీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ ముగిసిందని, ఈ నేపథ్యంలో మాప్ అప్ కౌన్సెలింగ్ నిర్వహించడం ఇబ్బందేనని కొందరు అధికారులు చెప్పారు. నిబంధనల ప్రకారం మాప్ అప్​ కౌన్సెలింగ్ నిర్వహించలేదు. దీంతో 14 కాలేజీల్లో తీసుకున్న 376 మంది అడ్మిషన్లపై సందిగ్ధం నెలకొన్నది. సర్కారు అనుమతి లేకుండానే అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించారనే ఆరోపణలూ నెలకొన్నాయి. దీంతో, ఆ అడ్మిషన్లకు రాటిఫై చేయాలని కాలేజీల మేనేజ్మెంట్లు, స్టూడెంట్లు హయ్యర్ ఎడ్యుకేషన్ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. 

సర్కారుకు హయ్యర్ ఎడ్యుకేషన్ అధికారుల లేఖ..​

ఇప్పటికే ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు పూర్తయ్యాయి. ఆ విద్యార్థుల అడ్మిషన్లను సర్కారు రాటిఫై చేస్తేనే.. వారి రిజల్ట్​ను ప్రకటించే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. దీనిపై అధికారులు సుప్రీంకోర్టుకూ పోయారు. అయినా ఫలితం లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో 14 కాలేజీల్లో  చేపట్టిన376 అడ్మిషన్లపై స్పష్టత ఇవ్వాలని హయ్యర్ ఎడ్యుకేషన్ అధికారులు సర్కారుకు లేఖ రాశారు. ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇస్తేనే, ఆ స్టూడెంట్ల ప్రవేశాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే పరిస్థితి ఏంటనే దానిపై అందరిలో ఆందోళన కొనసాగుతోంది.