భారీగా గంజాయి పట్టివేత.. 9 మంది అరెస్ట్‌‌‌‌

ఏపీ నుంచి అక్రమంగా తరలిస్తున్న 377 కిలోల గంజాయిని సోమవారం సూర్యాపేట జిల్లా మునగాల, పాలకవీడు, చిలుకూరు పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ రాజేంద్రప్రసాద్‌‌‌‌ సూర్యాపేటలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... ఉత్తరాఖండ్‌‌‌‌ రాష్ట్రం డెహ్రాడూన్‌‌‌‌కు చెందిన అర్షిత్‌‌‌‌ మాలిక్‌‌‌‌, ప్రియాంక గాంధీ అలియాస్‌‌‌‌ సన్నీ, తనుష్క మాలిక్, గీత సేన్‌‌‌‌ ముఠాగా ఏర్పడి గంజాయి వ్యాపారం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒడిశాలో 165 కిలోల గంజాయి కొని కారులో డెహ్రాడూన్‌‌‌‌కు తీసుకెళ్తున్నారు. మునగాల వద్ద పోలీసులు వెహికల్స్‌‌‌‌ తనిఖీ చేస్తున్న క్రమంలో వీరి కారుని ఆపగా గంజాయి విషయం బయటపడింది. అలాగే మహారాష్ట్రలోని నాసిక్‌‌‌‌కు చెందిన విజయ్‌‌‌‌ అసరం గోర్పడే, సీసాసత్ ప్రదీప్ ఏపీలోని తునిలో 182 కిలోల గంజాయి కొని కారులో నాసిక్‌‌‌‌ వెళ్తుండగా పాలకీడు మండలం గుండ్లపాడు వద్ద పోలీసులు పట్టుకున్నారు.

మరో కేసులో ఒడిశా రాష్ట్రానికి చెందిన సుభాశ్‌‌‌‌ హంతల్, సురేశ్‌‌‌‌ బార, మంగ్ల మండికి  ఏపీకి చెందిన జీవాతో పరిచయం ఏర్పడింది. హైదరాబాద్‌‌‌‌లో ఉన్న సంతోశ్‌‌‌‌ అనే వ్యక్తికి గంజాయిని రవాణా చేస్తే ఒక్కొక్కరికి రూ. 6 వేల చొప్పున ఇస్తానని జీవా చెప్పాడు. దీంతో 30 కిలోల గంజాయిని మూడు బ్యాగుల్లో నింపుకొని విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌‌‌‌ బయలుదేరారు. ఈ క్రమంలో కోదాడ నుంచి హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌కు ఆటోలో వెళ్తుండగా చిలుకూరులోని బేతవోలు క్రాస్‌‌‌‌ రోడ్డు పోలీసులు పట్టుకున్నారు. మూడు కేసుల్లో మొత్తం 9 మందిని అరెస్ట్‌‌‌‌ చేసి రూ. 37.70 లక్షల విలువైన గంజాయితో పాటు మూడు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకున్న పోలీస్‌‌‌‌ సిబ్బందికి రివార్డులు అందజేశారు. సమావేశంలో కోదాడ డీఎస్పీ వెంకటేశ్వర్‌‌‌‌రెడ్డి, సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం, కోదాడ రూరల్‌‌‌‌ సీఐ ప్రసాద్, మునగాల సీఐ ఆంజనేయులు, హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌ సీఐ రామలింగారెడ్డి, ఎస్సైలు శ్రీనివాస్, సైదులు, బాలునాయక్‌‌‌‌ పాల్గొన్నారు.

రెండు నెలల్లో 1600 కిలోలు గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా అక్రమార్కులు మాత్రం ఆగడం లేదు. టన్నుల కొద్దీ గంజాయిని గుట్టుచప్పుడు కాకుండా ఏపీ నుంచి తీసుకొస్తూనే ఉన్నారు. సూర్యాపేట జిల్లా పరిధిలో జూన్ నుంచి ఇప్పటివరకు కేవలం రెండు నెలల్లోనే 1,600 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొని, సుమారు 40 మందిపై కేసులు నమోదు చేశారు. ఇటీవల కోదాడ నుంచి భారీగా గంజాయిని తరలిస్తుండగా నల్గొండ జిల్లా నకిరేకల్‌‌‌‌ వద్ద సీసీఎస్‌‌‌‌ పోలీసులు పట్టుకొని 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. కోదాడ పరిసర ప్రాంతాల్లో రెండు రోజుల క్రితం సుమారు 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 

సూర్యాపేట కేంద్రంగా..

తెలంగాణ, ఏపీ బార్డర్‌‌‌‌ వద్ద పోలీసులు గంజాయిని పట్టుకుంటున్నా కొందరు వ్యక్తులు ఇతర మార్గాల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా జిల్లాలోకి గంజాయిని తీసుకొస్తున్నట్లు సమాచారం. ఏపీలోని విశాఖపట్నం నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని తీసుకొచ్చి సూర్యాపేట జిల్లా కేంద్రం సమీప గ్రామాల్లో నిల్వ చేస్తున్నట్లు తెలుస్తోంది. గంజాయిని అర్ధరాత్రి టైంలో గంజాయిని కిలో, అర కిలో ప్యాకెట్ల చొప్పున విడదీస్తూ ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం.