దేశంలో టీనేజర్లకు కరోనా వ్యాక్సినేషన్ ఇవాళ షురూ అయ్యింది. సోమవారం ఉదయం దేశవ్యాప్తంగా 15 ఏండ్ల నుంచి 18 ఏండ్ల లోపు వారికి వ్యాక్సినేషన్ మొదలుపెట్టారు ఆరోగ్య సిబ్బంది. వేగంగా వ్యాక్సిన్ ప్రక్రియను చేపట్టారు. రాత్రి 7 గంటల వరకు 37 లక్షల 84 వేల 212 మంది టీనేజర్లకు వ్యాక్సిన్ వేశారు. ఈ మేరకు కొవిన్ పోర్టల్‌లో సమాచారం అప్‌డేట్ చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. కాగా, దేశంలో ఇప్పటి వరకు మొత్తం 146.63 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వేసినట్లు పేర్కొంది. ఇందులో 85.38 కోట్లు ఫస్ట్ డోసు అని, 61.25 కోట్లు రెండో డోసు అని తెలిపింది కేంద్రం. ఇక ఇవాళ ఒక్క రోజే దాదాపు 94 లక్షల డోసుల వ్యాక్సిన్ వేసినట్లు కేంద్రం తెలిపింది.
COVID19 | 37,84,212 children in 15-17 age group vaccinated till 7pm as on the first day of COVID19 vaccination for children, as per CoWIN portal pic.twitter.com/76cpSeCA6v
— ANI (@ANI) January 3, 2022
50 లక్షల మందికి పైగా రిజిస్ట్రేషన్
జనవరి 3 నుంచి 15 – 18 ఏండ్ల మధ్య వయసు వారికి కరోనా వ్యాక్సిన్ వేయనున్నట్లు గత వారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. జనవరి 1 నుంచి వ్యాక్సినేషన్ కోసం టీనేజర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ప్రకటించారు. జనవరి 10 నుంచి ఫ్రంట్ లైన్ వారియర్లు, హెల్త్ సిబ్బంది, 60 ఏండ్లు పైబడిన వృద్ధులకు బూస్టర్ డోసు వేయనున్నట్లు చెప్పారు. కరోనా కేసుల పెరుగుదల, ఒమిక్రాన్ వేరియంట్ టెన్షన్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం. అయితే టీనేజర్ల వ్యాక్సినేషన్ కోసం జనవరి 1 నుంచి కొవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం కల్పించారు. ఈ మూడ్రోజుల్లో ఇప్పటి వరకు 50.28 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రస్తుతం టీనేజర్లకు కేవలం కొవాగ్జిన్ వ్యాక్సిన్ మాత్రమే వేస్తున్నారు.