కూలిన విమానం..38 మంది మృతి..ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా క్రాష్

కూలిన విమానం..38 మంది మృతి..ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా క్రాష్
  • పక్షుల గుంపును ఢీకొట్టడంతో కంట్రోల్ సిస్టమ్స్ ఫెయిల్
  • కజకిస్తాన్​లోని అక్టౌ ఎయిర్​పోర్టు సమీపంలో ఘటన
  • బకూ నుంచి రష్యాలోని గ్రోజ్నీకి వెళ్తుండగా ప్రమాదం
  • రెండు ముక్కలైన విమానం.. 29 మంది సురక్షితం

మాస్కో : కజకిస్తాన్​లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. అజర్‌‌‌‌బైజాన్‌‌‌‌ ఎయిర్‌‌‌‌లైన్స్‌‌‌‌కు చెందిన ప్యాసింజర్ విమానం బుధవారం ఉదయం అక్టౌ సమీపంలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 67 మంది ఉన్నారు. వీరిలో ఐదుగురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. పక్షుల గుంపును ఢీకొట్టడంతో ఇంజిన్​లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్​కు ప్రయత్నిస్తుండగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానం రెండు ముక్కలైంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఒక భాగం పూర్తిగా కాలిపోయింది. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఈ ప్రమాదంలో 38 మంది చనిపోయినట్లు కజకిస్తాన్‌‌‌‌ ఎమర్జెన్సీ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. 29 మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడినట్లు తెలిపింది. గాయపడిన వారిని అక్టౌలోని హాస్పిటల్​కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ల్యాండింగ్​కు ముందు విమానం ఆకాశంలో చాలాసార్లు చక్కర్లు కొట్టినట్లు ఎయిర్​పోర్టు సిబ్బంది తెలిపారు. అజర్​బైజాన్​కు చెందిన ‘జే2-8243’ విమానం బాకు నుంచి రష్యా రిపబ్లిక్ చెచెన్యా క్యాపిటల్ గ్రోజ్నీ వెళ్తుండగా ప్రమాదానికి గురైంది.

ప్రమాదానికి కారణమేంటి?

విమానాన్ని పక్షుల గుంపు ఢీకొట్టడంతో స్టీరింగ్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. కీలకమైన కంట్రోల్స్‌‌‌‌, బ్యాకప్‌‌‌‌ సిస్టమ్స్‌‌‌‌ ఫెయిల్ అయ్యాయి. విమానం స్పీడ్ తగ్గించి పైకి లేపేందుకు పైలెట్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఎమర్జెన్సీ ల్యాండింగ్​కు అనుమతివ్వాలని అక్టౌ ఎయిర్​పోర్టు అధికారులను కోరారు. అప్పటికీ విమానం ఇంకా ఎయిర్​పోర్టుకు 3 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఏటీసీ అధికారుల నుంచి రిప్లై వచ్చే వరకు విమానం ఎయిర్​పోర్టు చుట్టూ పలుమార్లు చక్కర్లు కొట్టింది. అప్పటికే కంట్రోల్స్, బ్యాకప్ సిస్టమ్స్ ఫెయిల్ కావడంతో విమానం స్పీడ్​గా క్రాష్ ల్యాండింగ్ అయింది.

దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. వెంటనే స్పందించిన అక్టౌ ఎయిర్​పోర్టు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఫైరింజన్లతో మంటలు ఆర్పేశారు. గాయపడిన వారిని దగ్గర్లోని హాస్పిటల్​కు తరలించారు. కాగా, గ్రోజ్నీలోని దట్టమైన మంచు కారణంగా విమానాన్ని దారి మళ్లించారు. ఈ క్రమంలోనే పక్షుల గుంపు ఒకటి విమానాన్ని ఢీకొట్టింది. దీంతో అక్టౌ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌‌‌‌కు ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తూ కూలిపోయింది.

11 ఏండ్లుగా సేవలందిస్తున్న విమానం

కూలిపోయిన విమానం ‘ఎంబ్రేర్ ఈ 190AR’ అజర్​బైజాన్ ఎయిర్​క్రాఫ్ట్. ఈ విమానం పేరు ‘గౌసర్’. 4కే–ఏజెడ్ 65తో రిజిస్ట్రేషన్ అయింది. అజర్​బైజాన్ రాజధాని బకులోని హేదర్ అలియేవ్ ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్టు నుంచి సేవలందిస్తున్నది. 2013లో ఈ విమానాన్ని తయారు చేశారు. ఇందులో జనరల్ ఎలక్ట్రిక్ సీఎఫ్34 అనే రెండు ఇంజిన్లు ఉంటాయి.

సంతాపం ప్రకటించిన  అజర్​బైజాన్, రష్యా అధ్యక్షులు

సెయింట్​పీటర్స్​బర్గ్ వెళ్తున్న అజర్​బైజాన్ ప్రెసిడెంట్ ఇల్హాన్ అలియేవ్.. ప్లేన్ క్రాష్ వార్త తెలుసుకుని తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. మాజీ సోవియట్ యూనియన్ దేశాల కూటమి ‘కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్’ లీడర్లతో అనధికారిక సమావేశానికి ఇల్హాన్ అలియేవ్ హాజరు కావాల్సి ఉండగా.. దాన్ని రద్దు చేసుకున్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. అలియేవ్​తో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్​లో మాట్లాడారు. ఈ మేరకు సంతాపం తెలియజేశారు.

విచారణకు ఆదేశించిన అధికారులు

విమానంలో మొత్తం 62 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నట్లు అజర్​బైజాన్ ఎయిర్​లైన్స్    సిబ్బంది తెలిపింది. ప్రయాణికుల్లో 37 మంది అజర్​బైజాన్ వాసులు అని, 16 మంది రష్యన్లు, ఆరుగురు కజకిస్తాన్, ముగ్గురు కిర్గిస్తాన్ సిటిజన్స్ అని వివరించింది. ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ప్రకటించింది.

ప్రమాదం జరిగిన వెంటనే ఎమర్జెన్సీ డోర్ నుంచి ప్రయాణికులు బయటికి దూకేశారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఘటనా స్థలాన్ని అజర్​బైజాన్ ఎమరెన్సీ మినిస్టర్, ఆ దేశ డిప్యూటీ జనరల్ ప్రాసిక్యూటర్, అజర్​బైజాన్ ఎయిర్​లైన్స్ వైస్​ప్రెసిడెంట్ సందర్శించారు. కజకిస్తాన్, అజర్​బైజాన్ అధికారులు కలిసి ఈ ఘటనపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.