- ఉమ్మడి జిల్లాలో.. బరిలో 229 మంది అభ్యర్థులు
- అత్యధికంగా పాలేరులో 39 మంది క్యాండెట్లు పోటీ
- వైరా, భద్రాచలంలో 13 మంది చొప్పున పోటీ
- 18, 19న ఉమ్మడి జిల్లాలో కేటీఆర్రోడ్షో
- 17న పినపాకలో రాహుల్ గాంధీ టూర్
ఖమ్మం/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గల్లో కలిపి 229 మంది అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. మొత్తం 267 నామినేషన్లకు గాను బుధవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే వరకు 38 మంది విత్ డ్రా చేసుకున్నారు. ఎన్నికల్లో అత్యధికంగా పాలేరు నియోజకవర్గంలో 39 మంది క్యాండెట్లు, ఖమ్మంలో 36 మంది, కొత్తగూడెంలో 30 మంది పోటీ పడుతున్నారు. ఈ మూడు సెగ్మెంట్లు జనరల్ స్థానాలు కావడం గమనార్హం. సత్తుపల్లిలో 26 మంది పోటీలో నిలిచారు. అత్యల్పంగా వైరా, భద్రాచలంలో 13 మంది చొప్పున పోటీ పడుతున్నారు. ఇక అత్యధికంగా ఇల్లందులో 10 మంది విత్ డ్రా చేసుకున్నారు.
ఊపందుకోనున్న ప్రచారం..
ఇక నామినేషన్ల ఉపసంహరణ కూడా ముగియడంతో ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకోనుంది. అభ్యర్థులు, ఆయా పార్టీల ముఖ్య నేతలు ప్రచారంపై నజర్ పెట్టనున్నారు. ఈసారి ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటన దగ్గర నుంచి, ముఖ్య నేతలతో బహిరంగ సభల వరకు అన్ని అంశాల్లో బీఆర్ఎస్ ముందంజలో ఉంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ బహిరంగ సభలు ముగిశాయి. మిగిలిన మధిర, వైరా నియోజకవర్గాల్లో ఈనెల 21న ప్రజా ఆశీర్వాద సభలకు కేసీఆర్ హాజరుకానున్నారు.
18, 19 తేదీల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఉమ్మడి జిల్లాలో రోడ్ షో నిర్వహించనున్నారు. 18న కొత్తగూడెం, 19న భద్రాచలం, ఇల్లందు, ఖమ్మంలో రోడ్ షోలో పాల్గొంటారు. ఇక ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ముఖ్య నేతలెవరూ ప్రచారానికి రాలేదు. ఈనెల 17న పినపాకలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. కార్నర్ మీటంగ్ లో పాల్గొంటారు. ఇక ఖమ్మం జిల్లాలో పాలేరులో రోడ్ షో కోసం ప్రియాంక గాంధీని రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.